16 ఏళ్ల టెండూల్కర్ కు అబ్దుల్ ఖాదిర్ విసిరిన సవాల్ ఇదే...

By telugu teamFirst Published Sep 7, 2019, 11:15 AM IST
Highlights

పాకిస్తాన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్ కన్నుమూశారు. మేటి బౌలరుగా బ్యాట్స్ మెన్ ను గడగడలాడిస్తున్న సమయంలో 16 ఏళ్ల పసి ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ కు అబ్దుల్ ఖాదిర్ సవాల్ విసిరాడు.

లాహోర్: పాకిస్తాన్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్ తన 63 ఏట గుండెపోటుతో మరణించారు. మైదానంలో ఆయన ఆటను చూడడం ఓ వినోదం. ఖాదిర్ ను ఎదుర్కోవడానికి కొమ్ములు తిరిగిన బ్యాట్స్ మెన్ కూడా ఇబ్బంది పడేవారు. అటువంటి స్థితిలో అంతర్జాతియ క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ కు ఆయన ఓ సవాల్ విసిరాడు. 

తాను విసిరిన సవాల్ ను అబ్దుల్ ఖాదిర్ ఆ తర్వాత 2018లో ఇండియా టుడె సలామ్ క్రికెట్ కార్యక్రమంలో గుర్తు చేశారు కూడా. సచిన్ టెండూల్కర్ తన 16వ యేట అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అది కూడా క్రికెట్ దిగ్గజాలు ఉన్న పాకిస్తాన్ జట్టును తన ప్రవేశంతోనే ఎదుర్కోవాల్సి వచ్చింది. 

పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ లో సచిన్ టెండూల్కర్ 239 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ లో రెండు అర్థ సెంచరీలుకూడా చేశాడు. ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, వసీం అక్రమ్ వంటి మేటి బౌలర్లను అతను ఎదుర్కున్నాడు. 

టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమైంది. పెషావర్ లో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే, అభిమానులను నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో దాన్ని 30 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచుగా మార్చారు. ఎగ్జిబిషన్ మ్యాచులో సచిన్ టెండూల్కర్ తమ దేశం బౌలర్లను ఎలా ఎదుర్కున్నాడనే విషయాన్ని ఖాదిర్ ఇండియా టు సలామ్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. 

తన బౌలింగులో నాలుగు సిక్సులను సచిన్ టెండూల్కర్ బాదిన విషయాన్ని ఖాదిర్ గుర్తు చేశారు. సచిన్ టెండూల్కర్ చిన్నపిల్లాడు కావడంతో అనురాగ భావన కలిగిందని, చాలా బాగా ఆడాడని ఆయన చెప్పారు. 

ఆ రోజు జరిగిన విషయాన్ని కూడా ఖాదిర్ చెప్పారు. వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిందని, అయితే పెద్ద యెత్తున ప్రేక్షకులు మ్యాచ్ చూడడానికి వచ్చారని. దాంతో నిర్వాహకులు దాన్ని 30 ఓవర్ల మ్యాచుగా కుదించారని ఆయన చెప్పారు.

ఖాదిర్ చెప్పిన వివరాల ప్రకారం.... ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిష్ణమాచారి శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కు దిగారు. ఖాదిర్ బౌలింగును తొలుత శ్రీకాంత్ ఎదుర్కున్నాడు. అయితే, శ్రీకాంత్ పరుగులేమీ చేయలేకపోయాడు. ఓవరు ముగిసిన తర్వాత ఖాదిర్ సచిన్ టెండూల్కర్ వద్దకు వెళ్లి ఇది అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కాదు, తన తర్వాతి ఓవరులో ప్రయత్నించి సిక్స్ కొట్టు, తన బౌలింగులో సిక్స్ కొడితే నువ్వు స్టార్ వి అవుతావు అని చెప్పాడు. 

ఖాదిర్ విసిరిన సవాల్ కు సచిన్ టెండూల్కర్ నోటి ద్వారా ఏ విధమైన సమాధానం కూడా ఇవ్వలేదు. ఖాదిర్ తర్వాతి ఓవరులో సచిన్ టెండూల్కర్ వరుసగా మూడు సిక్స్ లు బాదాడు. సచిన్ టెండూల్కర్ 18 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో ఖాదిర్ వేసిన ఓవరు కూడా ఉంది. 

సచిన్ టెండూల్కర్ ఖాదిర్ ఓవరులో తొలి బంతినే సిక్స్ మలిచాడు.  ఆ తర్వాత బంతికి నాలుగు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి పరుగులేమి చేయలేదు. ఆ తర్వాత చివరి మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్స్ లు బాదాడు. మరో వైపు నుంచి బౌలింగ్ చేస్తున్న ముస్తాక్ అహ్మద్ బౌలింగులో నాలుగు సిక్స్ లు బాదాడు.

సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేయడానికి తాను అన్ని విధాలా ప్రయత్నాలు చేశానని, తన సామర్థ్యం, ప్రతిభ, నైపుణ్యం ద్వారా తన ఓవరులో సచిన్ టెండూల్కర్ నాలుగు సిక్స్ లు కొట్టాడని ఖాదిర్ గుర్తు చేసుకున్నారు. 

సంబంధిత వార్త

పాక్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్ కన్నుమూత

click me!