
The Ashes 2021-22: వరుసగా మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి, యాషెస్ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకి ఊహించని షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ట్రావిడ్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. బ్రిస్బేన్‌లో జరిగిన గబ్బా టెస్టులో 148 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 152 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...
ఆడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 7 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మూడో టెస్టులో 27 పరుగులు చేసిన ట్రావిస్... 3 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 248 పరుగులు చేసి యాషెస్ సిరీస్ 2021-22 లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...
ట్రావిస్ హెడ్‌కి కరోనా పాజిటివ్‌గా రావడంతో అతను మెల్‌బోర్న్‌లోనే ఉండి, 7 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపబోతున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జనవరి 5 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకి ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలియచేసింది...
‘ట్రావిస్ హెడ్ ఈ రోజు కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. నాలుగో టెస్టుకి ట్రావిస్ అందుబాటులో ఉండడు. హోబర్ట్‌లో జరిగే ఐదో టెస్టుకి అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం...’ అంటూ తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా...
ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడడంతో ఉస్మాన్ ఖవాజాకి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మొదటి టెస్టులో ట్రావిస్ హెడ్ శతాధిక స్కోరు చేయడంతో ఉస్మాన్ ఖవాజాకి మూడు టెస్టుల్లోనూ అవకాశం దక్కలేదు.
ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడడంతో మిచెల్ మార్ష్, నిక్ మాడిన్‌సన్, జోష్ ఇంగ్లీష్‌లకు అదనపు కవర్‌గా పిలుపునిచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు... యాషెస్ సిరీస్‌కి మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న డేవిడ్ బూన్ కూడా కరోనా బారిన పడ్డాడు. సిడ్నీ టెస్టుకి డేవిడ్ బూన్ దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో స్టీవ్ బెర్నార్డ్, నాలుగో యాషెస్ టెస్టుకి రిఫరీగా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు...
ఆసీస్ నూతన టెస్టు సారథి ప్యాట్ కమ్మిన్ కూడా కరోనా కారణంగా రెండో టెస్టుకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన ఓ వ్యక్తితో ప్యాట్ కమ్మిన్స్‌కి క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్నట్టు తేలడంతో ముందు జాగ్రత్తగా అతను వారం రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపాడు. ప్యాట్ కమ్మిన్స్ గైర్హజరీలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆడిలైడ్ టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు..
మొదటి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత రెండో టెస్టులో 275 పరుగుల తేడాతో ఓడింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ జట్టు, ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది..