దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: అశ్విన్ 9 వికెట్లు తీస్తే హర్భజన్ ఇక వెనక్కే

By Siva KodatiFirst Published Oct 16, 2019, 3:56 PM IST
Highlights

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో ఉన్న హర్భజన్‌ను వెనక్కినెట్టేందుకు అశ్విన్‌ ప్రయత్నిస్తున్నాడు

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో ఉన్న హర్భజన్‌ను వెనక్కినెట్టేందుకు అశ్విన్‌ ప్రయత్నిస్తున్నాడు.

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య రాంచీ వేదికగా జరగబోయే మూడో టెస్టులో 8 వికెట్లు పడగొడితే భజ్జీతో కలిసి మూడో స్థానంలో నిలుస్తాడు. 9 వికెట్లు తీస్తే హర్భజన్‌ను వెనక్కినెట్టేస్తాడు. కాగా.. ఈ లిస్టులో దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 21 టెస్టుల్లో 84 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

పేసర్ జవగల్ శ్రీనాథ్ 13 టెస్టుల్లో 64 వికెట్లతో రెండో స్థానంలో.. హర్భజన్ సింగ్ 11 టెస్టుల్లో 60 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో నిలిచాడు. అశ్విన్ విషయానికి వస్తే 9 టెస్టుల్లో 52 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

మాజీ స్పిన్నర్ జహీర్‌ఖాన్ దక్షిణాఫ్రికాపై 12 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు పడగొట్టి ఐదో స్థానంలో నిలిచాడు. కాగా టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసి అశ్విన్ చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 66 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా.. అశ్విన్‌కు సైతం ఇది 66వ మ్యాచ్ కావడం విశేషం.

ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు విజయాలు సాధించి 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. మూడో టెస్టును కూడా గెలిచి సఫారీలను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. మరోవైపు కోహ్లీసేన ప్రస్తుతం 200 పాయింట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో పుణేలో జరిగిన రెండో టెస్టులో విజయం ద్వారా కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్. దీనితో పాటు 50వ టెస్టుకు నాయకత్వం వహించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37, రికీ పాంటింగ్‌లు మొదటి, రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్ కోహ్లీయే కావడం విశేషం.

click me!