ధోని రిటైర్మెంట్ వాయిదా.... ఆ ప్రపంచ కప్ వరకు కొనసాగాలని కోహ్లీ కోరడంతోనే

By Arun Kumar PFirst Published Jul 23, 2019, 7:24 PM IST
Highlights

టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఏడాది పాటు వాయిదాా పడినట్లు సమాచారం. కెప్టెన్ విరాట్ కోహ్లీ అభ్యర్థన మేరకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలోనే టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్న ధోని ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రపంచ కప్ ముగిసి వారం రోజులు కావస్తున్న ధోని నుండి గానీ, బిసిసిఐ నుండి కానీ ఈ అంశంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ధోని  రిటైర్మెంట్ అంశంపై అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయితే ధోని తన కెరీర్ ను ముగించడానికి సిద్దంగా వున్నా టీమిండియా మేనేజ్ మెంట్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు అడ్డుపడ్డారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. 

ఓ ఆంగ్ల దినపత్రిక ధోని రిటైర్మెంట్ పై కథనం ప్రచురిస్తూ...కెప్టెన్ కోహ్లీ మూలంగానే ధోని రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సూపర్ ఫినిషర్, వికెట్ కీపర్ గా ధోని అవసరాన్ని గుర్తించిన కోహ్లీ ధోని రిటైర్మెంట్ ను అడ్డుకుంటున్నట్లు తెలిపింది. దీంతో మరో సంవత్సరం పాటు కొనసాగే అవకాశాలున్నాయని సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. 

అయితే ధోని కూడా  కోహ్లీ నిర్ణయాన్ని సమ్మతించిన... జట్టులో యాక్టివ్ ప్లేయర్ గా వుండటానికి మాత్రం ఇష్టపడటం లేదని. బయటి నుండే తన అనుభవంతో కూడిన సలహాలు, సూచనలను యువ క్రికెటర్లకు అందించాలని భావిస్తున్నాడు. అలా భారత జట్టుకు సహకరిస్తూనే విశ్రాంతి  కూడా తీసుకునే అవకాశం వుంటుందన్నది ధోని ఆలోచనగా కనిపిస్తోంది. 

ఇక ఇప్పటికే దినేశ్ కార్తిక్, రిషబ్ పంత్ ల రూపంలో టీమిండియాకు వికెట్ కీపర్లున్నారు. అయితే వీరెవరు ధోని లాగ అనుభవజ్ఞులు కారు. కాబట్టి రానున్న టీ20 ప్రపంచ కప్ కోసం వారిని తయారుచేస్తూనే మరో వైపు ధోనిని కూడా కొనసాగించాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఆ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ధోని పూర్తిగా జట్టు నుండి తప్పుకున్నా వీరు కాస్త అనుభవాన్ని సంపాదిస్తారు కాబట్టి ఎలాంటి నష్టం వుండదన్నది కోహ్లీ, బిసిసిఐ అభిప్రాయంగా కనిపిస్తోంది.   

 

click me!