టెస్టుల్లో ఏడో డబుల్ సెంచరీ: టీమిండియా తరపున ‘కోహ్లీ’ ఒకేఒక్కడు

By Siva KodatiFirst Published Oct 11, 2019, 4:07 PM IST
Highlights

రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు

రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.

ఓవర్‌నైట్ స్కోరు 63తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ.. వైస్ కెప్టెన్ రహానెతో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానె.. మహారాజ్ బౌలింగ్‌‌లో పెవిలియన్ చేరాడు.

అనంతరం అల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసిన కోహ్లీ అతనితో కలిసి 107 పరుగుల భాగస్వామ్యా నెలకొల్పాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ఏడో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ కొద్దిసేపటికే ఏడు వేల పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు.

కాగా సర్ డాన్ బ్రాడ్‌మన్ 12 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 11, విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 9 డబుల్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

మరోవైపు 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 254 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. మయాంక్ అగర్వాల్ 108, జడేజా 91 పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3, మహారాజ్, ముత్తుస్వామి తలో వికెట్ పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మార్కమ్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
 

click me!