బౌండరీల ఆధారంగా విజేతలా...! ఇలా చేస్తే బావుండేది: టీమిండియా కోచ్

By Arun Kumar PFirst Published Jul 22, 2019, 8:28 PM IST
Highlights

ప్రపంచ కప్ ఫైనల్లో విజేతను నిర్ణయించడానికి ఐసిసి ఉపయోగించిన అత్యధిక బౌండరీల నిబంధనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అలా బౌండరీల పద్దతిన కాకుండా మరో విధానం ద్వారా కూడా విజేతను నిర్ణయించవచ్చని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు.  

ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ విజేతను నిర్ణయించడంలో ఐసిసి అనుసరించిన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా రెండు జట్లు వంద ఓవర్ల పాటు తలపడ్డా తేలని ఫలితాన్ని కేవలం ఒక్క సూపర్ ఓవర్ ద్వారా తేల్యడాన్నే కొందరు క్రికెట్ పండితులు, అభిమానులు తప్పుబడుతున్నారు. అలాంటిది ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో బౌండరీల పద్దతిన విజేతను నిర్ణయించడం మరింత వివాదానికి దారితీసింది. ఐసిసి నిబంధనలు క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తూ మరీ ఇంత ఫన్నీగా ఎలా వుంటాయంటూ క్రికెట్ ప్రియులు మండిపడుతున్నారు. తాజాగా ఈ ఐసిసి నిబంధనలపై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తప్పుబట్టాడు.  

నిర్ణీత ఓవర్ల మ్యాచుల్లో ఫలితం తేలకుండా ఇరు జట్లు సమానమైన పరుగులు సాధించినప్పుడు సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేలుస్తారు. అయితే ఈ సూపర్ ఓవర్ కూడా టై అయినపుడు ఎవరు ఎక్కువగా బౌండరీలు బాదితే వారిదే విజయం. ఈ ఐసిసి నిబంధన వల్లే ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ గెలిచి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయితే ఇలా సూపర్ ఓవర్ కూడా టై అయితే మరో సూపర్ ఓవర్ నిర్వహించి విజేతలను తేల్చాల్సి వుండాల్సిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. సచిన్ సూచించిన విధానానికి తాజాగా భరత్ అరుణ్ కూడా మద్దతు తెలిపాడు. 

అంతేకాకుండా మరికొన్ని పద్దతుల్లో కూడా మ్యాచ్ ఫలితాన్ని రాబట్టే అవకాశాలున్నాయని తెలిపాడు. బౌండరీలను లెక్కించడం కాకుండా వికెట్లను లెక్కిస్తే మరింత సమంజసంగా వుంటుందని అభిప్రాయపడ్డాడు. అన్నింటికన్నా మంచిది మరో సూపర్ ఓవర్ నిర్వహించడం. ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్స్ నిర్వహిస్తే మంచిదని...అలా కాకుండా బౌండరీల ద్వారా ఓ జట్టు గెలుపును నిర్ణయించడం సరికాదన్నాడు. అసలు అలాంటి నిబంధన ఐసిసి ఎందుకు ప్రవేశపెట్టిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. 

click me!