IPL 2022: పంజాబ్ కింగ్స్ కు పాతకథే.. ఇక ప్లేఆఫ్స్ కు కష్టమే.. టాప్-3కి చేరిన లక్నో..

Published : Apr 29, 2022, 11:28 PM ISTUpdated : Apr 29, 2022, 11:33 PM IST
IPL 2022: పంజాబ్ కింగ్స్ కు పాతకథే.. ఇక ప్లేఆఫ్స్ కు కష్టమే.. టాప్-3కి చేరిన లక్నో..

సారాంశం

TATA IPL 2022: బ్యాటర్లు విఫలమైన చోట లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తమ బ్యాటర్లు చేసింది తక్కువ స్కోరే అయినా.. దానిని కూడా కాపాడుకున్నారు. పంజాబ్ కు ఇది ఐదో ఓటమి.  తన  మాజీ జట్టుపై  బ్యాటర్ గా విఫలమైన కెఎల్ రాహుల్.. కెప్టెన్ గా  మాత్రం సక్సెస్ అయ్యాడు.

తమకు బ్యాటింగ్ లో అనుకూలించని పిచ్ పై లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు  అద్భుతంగా పోరాడారు. చేసింది తక్కువ స్కోరే అయినా అద్భుతంగా కాపాడుకున్నారు.  ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని   పంజాబ్ కింగ్స్ చేజేతులా పాడుచేసుకుంది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక చతికిలపడింది.  తమ బౌలర్లు కష్టపడ్డా బ్యాటర్లు మళ్లీ పాత కథే పునరావృతం చేశారు. లక్నో బౌలర్ల ధాటికి పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓడింది. కాగా ఐపీఎల్-15లో పంజాబ్ కు ఇది ఆడిన 9 మ్యాచుల్లో ఐదో ఓటమి.  దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు మరింత సంక్లిష్టమైంది. ఇక లక్నో... 9 మ్యాచుల్లో ఆరు నెగ్గి సన్ రైజర్స్ ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరింది. ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానంలో నిలిచింది. 

మోస్తారు లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది.  ఆ జట్టు సారథి మయాంక్ అగర్వాల్ (17 బంతుల్లో 25.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడాడు. కానీ మరోవైపు ధావన్ మాత్రం (15 బంతుల్లో 5) క్రీజులో నిలవడానికి ఇబ్బందిపడ్డాడు. 

మోహిసిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్లో 6, 4 కొట్టి ఊపు మీద కనిపించిన మయాంక్.. చమీర వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టి నాలుగో బంతికి మిడాఫ్ లో ఉన్న కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో ఉండటానికే ఇబ్బందిపడ్డ ధావన్.. రవిబిష్ణోయ్ వేసిన ఏడో ఓవర్లో మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే  కృనాల్ పాండ్యా.. రాజపక్సను ఔట్ చేశాడు. తొలి నాలుగు ఓవర్లలో రాకెట్ స్పీడ్ తో వెళ్లిన పంజాబ్ స్కోరు తర్వాత నెమ్మదించింది. పది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ చేసింది 67 పరుగులే. 

ఆ క్రమంలో బెయిర్ స్టో (28 బంతుల్లో 32.. 5 ఫోర్లు) కు జతకలిసిన లివింగ్ స్టోన్ (16 బంతుల్లో 18.. 2 సిక్సర్లు) రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్లో రెండు  బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. కానీ మోహిసిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో వికెట్ కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లివింగ్ స్టన్ నిష్క్రమణ అనంతరం పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 

పంజాబ్ భారీ ఆశలు పెట్టుకున్న జితేశ్ శర్మ (2) ను కృనాల్ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా.. ప్రమాదకర బెయిర్ స్టో ను చమీర 16 వ ఓవర్  రెండో బంతికి ఔట్ చేశాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న రబాడా (2) ను కూడా మోహిసిన్ ఖాన్ పెవిలియన్ కు చేర్చాడు. అదే ఊపులో రాహుల్ చాహర్ (4) కూడా ఔట్ చేశాడుు. ఆఖర్లో రిషి ధానవ్ (21 నాటౌట్) బ్యాట్ ఝుళిపించినా  అది  పంజాబ్ కు విజయాన్ని అందించలేదు.  లక్నో బౌలర్లలో మోహిసిన్ ఖాన్ 3 వికెట్లు తీయగా..చమీర, కృనాల్ రెండు వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కు ఒక వికెట్ దక్కింది. 

అంతకుముదు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (6) విఫలమైనా.. డికాక్ (46), దీపక్ హుడా (34) రాణించారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో లక్నో బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇదిలాఉండగా బ్యాటర్ గా తన మాజీ జట్టుపై కసితీరా ఆడలేకపోయిన  లక్నో సారథి కెఎల్ రాహుల్.. కెప్టెన్ గా మాత్రం విజయం సాధించి రివేంజ్ తీర్చుకున్నాడు.

సంక్షిప్త స్కోరు వివరాలు : 

లక్నో సూపర్ జెయింట్స్ : 20 ఓవర్లలో 153-8
పంజాబ్ కింగ్స్ :  20 ఓవర్లలో 133-8 
ఫలితం :  20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్  గెలుపు 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !