టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ... మెరుపు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా... ఇంగ్లాండ్ ముందు 169 పరుగుల టార్గెట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పవర్ చూపించాడు. పాక్‌తో మ్యాచ్ తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన పాండ్యా, కీలక మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో టీమిండియాకి మంచి స్కోరు అందించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది...
కీలక మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెఎల్ రాహుల్ మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా... రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు...
undefined
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికి 4 బాదిన కెఎల్ రాహుల్, 5 బంతుల్లో 5 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఈ దశలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకునే ప్రయత్నం చేశారు. మొదటి 10 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, సామ్ కుర్రాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
మంచి టచ్‌లోకి వచ్చినట్టు కనబడిన రోహిత్ శర్మ, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో సామ్ కుర్రాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మరోసారి నిరాశపరిచాడు...
క్రీజులోకి వస్తూనే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా ఓ సిక్సర్, ఫోర్ బాదాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఆ తర్వాత అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు సూర్య. 10 బంతుల్లో 14 పరుగులు చేసిన సూర్య అవుటయ్యే సమయానికి 12.2 ఓవర్లలో 75 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...
ఈ దశలో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాతో కలిసి నాలుగో వికెట్‌కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 100 ఫోర్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో 4 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ...
40 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. 2014 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 44 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో 47 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అదిల్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి 18వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ... ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీకి ఇది 6వ 50+ స్కోర్లు. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు కోహ్లీ...
సామ్ కుర్రాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వరుసగా 4, 6, 4 బాదిన హార్ధిక్ పాండ్యా 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు... తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదిన రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాకి స్ట్రైయిక్ ఇచ్చేందుకు రనౌట్ అయ్యాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు.