కివీస్‌కు మరో‘సారీ’.. సెమీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. ఫైనల్‌కు పాకిస్తాన్..

By Srinivas M  |  First Published Nov 9, 2022, 4:59 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి అసలు సెమీస్ రేసులో లేని  పాకిస్తాన్ ఇప్పుడు నేరుగా ఫైనల్ కు చేరింది.  ఈ టోర్నీలో ఇప్పటివరకు   మెరుగైన ఆటతీరుతో ఆడిన న్యూజిలాండ్.. తొలి సెమీస్ లో దారుణంగా ఓడింది. 


టీ20 ప్రపంచకప్ లో అసలు సెమీస్ రేసులోనే లేని పాకిస్తాన్ ఏకంగా ఫైనల్స్ కు చేరింది.   వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడంతో అదృష్టం కొద్దీ సెమీస్ చేరిన  పాకిస్తాన్.. సెమీఫైనల్స్ లో పటిష్ట న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ మీద అంత గొప్ప రికార్డు లేని న్యూజిలాండ్ మరోసారి అదే తడబాటుతో సెమీస్  తో పాటు ప్రపంచకప్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.  ఇక ఇంగ్లాండ్ - ఇండియా మధ్య గురువారం జరుబోయే మ్యాచ్ లో విజేతతో  పాకిస్తాన్ ఈనెల 13న ఫైనల్లో తలపడుతుంది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యాన్ని  పాకిస్తాన్.. 19.1  ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

Latest Videos

undefined

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (43 బంతుల్లో 57, 5 ఫోర్లు), బాబర్ ఆజమ్ (42 బంతుల్లో 53,  7 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కలిసి  తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. ఓ క్రమంలో ఈ ఇద్దరూ  గతేడాది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో  మాదిరిగానే వికెట్లేమీ కోల్పోకుండా  ఛేదనను పూర్తి చేస్తారా..? అనిపించింది. 

రిజ్వాన్-బాబర్ ల జోడీ ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించింది. బౌల్ట్ వేసిన తొలి బంతినే ఫోర్ బాదిన రిజ్వాన్.. అదే ఓవర్లో ఐదో బంతికి ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో రిజ్వాన్ రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత  రిజ్వాన్.. సౌథీ పని పట్టాడు. బాబర్ కూడా  వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు  కొట్టాడు. పదో ఓవర్లో ఫెర్గూసన్ వేసిన పదో ఓవర్లో చివరి బంతికి రెండు రన్స్ తీసిన బాబర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

కానీ  ట్రెంట్ బౌల్ట్  వేసిన 12 వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడిన   బాబర్.. లాంగాన్ లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  హాప్ సెంచరీ తర్వాత  రిజ్వాన్.. లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలనే తొందర్లో భారీ షాట్ ఆడి ఫెర్గూసన్ చేతికి చిక్కాడు. బాబర్ నిష్క్రమణ తర్వాత వచ్చిన  మహ్మద్ హరీస్ (26 బంతుల్లో 30, 2 ఫోర్లు, 1 సిక్స్) చివరి  వరకూ నిలిచినా విజయానికి రెండు పరుగుల దూరంలో  సాంట్నర్ బౌలింగ్ లో ఫిన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చాడు. షాన్ మసూద్ (3), ఇఫ్తికార్ అహ్మద్ లు  మరో వికెట్ పడకుండా పాక్  కు విన్నింగ్ రన్స్ కొట్టి ఫైనల్ చేర్చారు. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలలో పాకిస్తాన్ కు ఇది మూడో ఫైనల్ కావడం గమనార్హం. గతంలో 2007, 2009లో  పాకిస్తాన్ ఫైనల్ కు చేరింది. 2009 తర్వాత ఫైనల్స్ కు చేరడం పాక్ కు ఇదే తొలిసారి. ఇదిలాఉండగా 2015, 2019లో వన్డే ప్రపంచకప్ లో ఫైనల్స్, గతేడాది  టీ20 ప్రపంచకప్ లో ఆసీస్ చేతిలో  తుది పోరులో ఓడిన కివీస్ కు ఇది మరో కోలుకోలేని షాక్. ఐసీసీ టోర్నీ కోసం ఆ జట్టు ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలో..? 

click me!