బంగ్లాను ఓడించిన పాకిస్తాన్ సెమీస్‌కు.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఇంటికి..

By Srinivas MFirst Published Nov 6, 2022, 1:03 PM IST
Highlights

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో   వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా సెమీ ఫైనల్స్  బెర్త్ ను ఖాయం చేసుకుంది.  అదృష్టం కలిసి రావడంతో  తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. 
 

భారీ ఆశలతో టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టి వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన పాకిస్తాన్ అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది.  సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ లో సఫారీలు ఓటమిపాలవ్వడంతో  సెమీస్ చేరే అవకాశం పాకిస్తాన్ - బంగ్లాదేశ్ లకు వచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్  అన్ని విభాగాలలో రాణించగా  బంగ్లాదేశ్ మాత్రం చతికిలపడి  అద్భుత అవకాశాన్ని కోల్పోయింది.   

అడిలైడ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓపెనర్లు ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో  ఆడుతూ పాడుతూ సాగింది మరో 11 బంతులు మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుని సెమీస్  కు చేరింది. 

పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 25, 2 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 32,  2 ఫోర్లు, 1 సిక్సర్)  తొలి వికెట్ కు 57 పరుగుుల జోడించారు.   భారీ షాట్లకు పోకుండా సాఫీగా ఇన్నింగ్స్ ను నడిపించారు. తొలి పది ఓవర్లలో పాకిస్తాన్.. 56 పరుగులే చేసింది. కానీ 11వ ఓవర్లో మూడో బంతికి బాబర్ ను నసుమ్ అహ్మద్ ఔట్ చేశాడు. తర్వాత ఓవర్లో ఎబాదత్ హుస్సేన్.. రిజ్వాన్ ను పెవిలియన్ కు పంపాడు. 

వన్ డౌన్ లో వచ్చిన మహ్మద్ నవాజ్ (4) కూడా  త్వరగానే పెవలియన్ చేరాడు. కానీ మహ్మద్ హారిస్ (18 బంతుల్లో 31, 1 ఫోర్, 2 సిక్సర్లు)  ధనాధన్ ఆడి పాక్ విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో అతడితో పాటు  ఇఫ్తికార్ అహ్మద్ (1) పెవిలియన్ కు చేరినా  షాన్ మసూద్ (14 బంతుల్లో 24 నాటౌట్)  పాకిస్తాన్ కు విజయాన్ని అందించాడు. ఆరు వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ చేరగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలు తమ బ్యాగులను సర్దుకున్నాయి.

 

𝐓𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐬𝐞𝐦𝐢𝐬! 🇵🇰 | pic.twitter.com/e1yyRxjeag

— Pakistan Cricket (@TheRealPCB)

కాగా సౌతాఫ్రికా ఓటమితో అనూహ్యంగా సెమీస్ రేసుకు వచ్చిన బంగ్లాదేశ్  బ్యాటింగ్ లో ఆ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలపడింది.  కీలక మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ కు వచ్చి 8 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. ఆ  జట్టు ఓపెనర్ నజ్ముల్ శాంతో (54) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. కీలక ఆటగాళ్లైన లిటన్ దాస్ (10), షకిబ్ (0), సౌమ్య సర్కార్ (20), మొసాద్దేక్ హోసేన్ (5) లు విఫలమయ్యారు. 

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20లలో అతడికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన (4-22). షాదాబ్ ఖాన్ రెండు, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

 

Against all odds, Pakistan have made it to the semi-finals 🎉 pic.twitter.com/VQjtNpbfYc

— ICC (@ICC)
click me!