పసికూన చేతుల్లో దారుణ పరాజయాన్ని చవి చూసిన ఇంగ్లాండ్... డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం...
టీ20 వరల్డ్ కప్ 2022లో మరో అద్భుతం జరిగింది. పసికూన ఐర్లాండ్ చేతుల్లో ఇంగ్లాండ్ దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది ఐర్లాండ్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మరో అద్భుతం జరిగింది. రెండు సార్లు పొట్టి ప్రపంచకప్ గెలిచిన విండీస్, క్వాలిఫైయర్స్ నుంచే ఇంటిదారి పట్టిన విషయం మరవకముందే పసికూన ఐర్లాండ్ చేతుల్లో 2010 టీ20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్ పరాజయాన్ని చవి చూసింది...2009, 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో నెదర్లాండ్స్‌తో మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్‌కి అసోసియేట్ టీమ్స్ చేతుల్లో మూడో పరాభవం...
158 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, వర్షం కారణంగా మ్యాచ్ నిలిపేవేసే సమయానికి 14.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ డకౌట్ కాగా అలెక్స్ హేల్స్ 7, బెన్ స్టోక్స్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్..
21 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన హారీ బ్రూక్ అవుటైన తర్వాత 37 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు చేసిన డేవిడ్ మలాన్ కూడా పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేసింది ఇంగ్లాండ్. ఆ తర్వాతి ఓవర్‌లో మొయిన్ ఆలీ 6,2,4 బాది 12 పరుగులు రాబట్టాడు మొయిన్ ఆలీ. అయితే ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..
అప్పటికి డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చేయాల్సిన పరుగుల కంటే ఇంగ్లాండ్ 5 పరుగులు వెనకబడి ఉండడంతో ఐర్లాండ్‌కి చారిత్రక విజయం దక్కింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ చేతుల్లో ఓడిన ఇంగ్లాండ్, 11 ఏళ్లకు టీ20 వరల్డ్ కప్‌లో మళ్లీ ఐర్లాండ్ చేతుల్లోనే ఓటమి చవిచూసింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో 157 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాల్ స్టిర్లింగ్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఐర్లాండ్..
అయితే కెప్టెన్ ఆండ్రూ బాల్బరీన్, టక్కర్ కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 12 ఓవర్లు ముగిసే సమయానికి 103/1 పరుగులు చేసిన ఐర్లాండ్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే 27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన టక్కర్ రనౌట్ అయిన తర్వాత హారీ టెక్కర్‌ని డకౌట్ చేశాడు మార్క్‌వుడ్...
47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన బాల్బరీన్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అవుట్ కాగా కర్టీస్ కాంపర్ 11 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేశాడు. డాక్‌రెల్ డకౌట్ కాగా మార్క్ అదైర్ 4, బారీ మెక్‌కార్తీ 3, ఫిన్ హాండ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. టక్కర్ అవుటైన తర్వాత 54 పరుగుల తేడాతో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఐర్లాండ్...
మార్క్ వుడ్, లియామ్ లివింగ్‌స్టోన్ మూడేసి వికెట్లు తీయగా సామ్ కుర్రాన్ 2 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్‌కి ఓ వికెట్ దక్కింది.