టీ20 వరల్డ్ కప్ 2022: బోణీ కొట్టిన ఇంగ్లాండ్... ఆఫ్ఘాన్‌పై సామ్ కుర్రాన్ రికార్డు స్పెల్‌...

By Chinthakindhi Ramu  |  First Published Oct 22, 2022, 7:39 PM IST

T20 World cup 2022: ఆఫ్ఘాన్‌పై 5 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్... మొదటి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం...


టీ20 వరల్డ్ కప్ 2022లో టైటిల్ ఫెవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ ఘన విజయంతో టోర్నీని మొదలెట్టింది. గాయం కారణంగా గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌కి దూరమైన ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, 5 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడినా విజయం అందించగలిగారు. 

113 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కి శుభారంభం దక్కింది. 18 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్, ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

Latest Videos

డేవిడ్ మలాన్ 30 బంతుల్లో 18 పరుగులు చేయగా బెన్ స్టోక్స్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి మహ్మద్ నబీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...  ఒకానొక దశలో ఈజీగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన ఇంగ్లాండ్, వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచులను ఆఫ్ఘాన్ ప్లేయర్లు ఒడిసి పట్టలేకపోయారు. 

ఫరీద్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రెండు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు లియామ్ లివింగ్‌స్టోన్. అయితే 7 పరుగులు చేసిన హారీ బ్రూక్‌ని అవుట్ చేసిన రషీద్ ఖాన్, మ్యాచ్‌ని ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే పరుగులు నియంత్రించడంలో మిగిలిన బౌలర్లు విఫలమయ్యారు. 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్, 19.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హజ్రతుల్లా జజాయి 7, గుర్భాజ్ 10 పరుగులు చేసి అవుట్ కాగా ఇబ్రహీం జాద్రాన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేయగా ఉస్మాన్ గనీ 30 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు...

నజీబుల్లా 13, మహ్మద్ నబీ 3, అజ్మతుల్లా 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్. అజ్మతుల్లా అవుటైన తర్వాతి బంతికే రషీద్ ఖాన్ గోల్డెన్ డకౌట్ కాగా ముజీబ్ వుర్ రహీం కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఫజల్‌హక్ ఫరూకీ కూడా డకౌట్ అయ్యాడు...

ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా సామ్ కుర్రాన్ 3.4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్‌కి ఓ వికెట్ దక్కింది.. టీ20ల్లో ఇంగ్లాండ్ తరుపున ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు సామ్ కుర్రాన్...

click me!