T20 World Cup 2022: ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టుకు ఆస్ట్రేలియాలో తొలి షాక్ తాకింది. కొద్దిరోజుల క్రితం భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన సఫారీ జట్టు అందుకు బదులు తీర్చుకుంది.
ఫీల్డింగ్ వైఫల్యాలు, క్యాచ్ మిస్ లతో భారత జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. బౌలర్లకు అనుకూలించిన పెర్త్ పిచ్ పై బౌలర్లు కట్టడి చేసిన ఫీల్డింగ్ తప్పిదాలతో భారత్ రెండు వరుస విజయాల తర్వాత టీ20 ప్రపంచకప్ లో ఓటమి మూటగట్టుకుంది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా.. 19. 4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ జట్టులో డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్రమ్ (41 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ఆచితూచి ఆడి తమ జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు. ఫలితంగా భారత్ పై ఈ నెల ప్రారంభంలో ముగిసిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ విజయంతో గ్రూప్ - 2 లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఉంటాయనుకుంటున్న తరుణంలో టీమిండియా ఓడటంతో బాబర్ అండ్ కో.. కు ఇక టోర్నీలో ముందుకెళ్లడం కష్టమే కానుంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో సఫారీలకు కూడా గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో క్వింటన్ డికాక్ (1), రిలీ రొసోవ్ (0) ఔట్ అయ్యారు. ఐదు ఓవర్లకు సఫారీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 21 పరుగులే. ఆరో ఓవర్లో షమీ.. టెంబ బవుమా (10) ను పెవిలియన్ కు పంపాడు. తొలి పవర్ ప్లే లో సఫారీలు.. 3 వికెట్లకు 24 పరుగులు మాత్రమే చేశారు.
ఆ సమయంలో అదే ఒత్తడిని సఫారీల మీద చూపించలేకపోయారు టీమిండియా బౌలర్లు. పరుగులు కట్టడి చేశారే గానీ వికెట్లు తీయలేకపోయారు. 11 ఓవర్లకు సఫారీ స్కోరు 50 దాటింది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ లు క్రీజులో కుదురుకున్నారు. అదే సమయంలో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం సఫారీలకు మ్యాచ్ లో అవకాశాలను పెంచింది.
అశ్విన్ వేసిన 12వ ఓవర్లో ఐదో బంతికి మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కోహ్లీ జారవిడిచాడు. ఆ తర్వాత ఓవర్లో రోహిత్ శర్మ.. డేవిడ్ మిల్లర్ ను రనౌట్ చేసే ఛాన్స్ ను మిస్ చేశాడు. అంతకుముందు కూడా రోహిత్.. మార్క్రమ్ ను రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. సూర్య కూడా వికెట్ల గురి తప్పాడు. ఇద్దరికీ చెరో లైఫ్ దొరకడంతో సఫారీ బ్యాటర్లు రెచ్చిపోయారు. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో మార్క్రమ్.. రెండు భారీ సిక్సర్లు బాదాడు. అదే క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు.. 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేశారు.
A thrilling win for South Africa and it takes them to the top of the table in Group 2 💪 | | 📝: https://t.co/uficuiMq0H pic.twitter.com/0TLFpUmAd7
— ICC (@ICC)హాఫ్ సెంచరీ తర్వాత మార్క్రమ్.. హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. చివరి 3 ఓవర్లలో 25 పరుగులు అవసరముండగా.. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో మిల్లర్ రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్ ను ముగించే దిశగా సాగాడు. కానీ అదే ఓవర్లో అశ్విన్.. నాలుగో బంతికి స్టబ్స్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.
ఇక చివరి రెండు ఓవర్లలో 12 పరుగుల అవసరం కాగా.. షమీ వేసిన 19వ ఓవర్లో 6 పరుగులొచ్చాయి. భువీ బౌలింగ్ లో మిల్లర్ రెండు ఫోర్లు బాది దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్-2లో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు కోల్పోయినట్టే..!
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. భారత జట్టులో సూర్య ఒక్కడే 40 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా దారుణంగా విఫలమయ్యారు. సూర్య తప్ప మిగతా టీమిండియా బ్యాటర్లంతా 57 పరుగులు మాత్రమే చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. పార్నెల్ 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. నోర్త్జ్ కు ఒక వికెట్ దక్కింది.