సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం... తల్లి మరణవార్త తెలిసినా కామెంటరీ చెప్పిన ‘లిటిల్ మాస్టర్’...

By Chinthakindhi RamuFirst Published Dec 26, 2022, 10:30 AM IST
Highlights

95 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన మీనల్ గవాస్కర్... తల్లి మరణవార్త తెలిసినా కామెంటరీ కొనసాగించిన సునీల్ గవాస్కర్.. 

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సునీల్ గవాస్కర్ తల్లి మీనల్ గవాస్కర్, అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. 95 ఏళ్ల మీనల్ గవాస్కర్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.. డిసెంబర్ 25న ముంబైలోని స్వగృహంలో మీనల్ గవాస్కర్ తుది శ్వాస విడిచారు...

తల్లి మరణ వార్త తెలిసినప్పటికీ సునీల్ గవాస్కర్ కామెంటరీ చెప్పి, తన వృత్తి నిబద్ధతని చాటుకున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కామెంటేటర్‌గా మారిన సునీల్ గవాస్కర్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కి కూడా కామెంటరీ చెప్పారు. ఆట నాలుగో రోజు కూడా యథావిథిగా విధులకు వచ్చిన సునీల్ గవాస్కర్, తల్లి మరణ వార్త గురించి తెలిసిందే.

అయితే మ్యాచ్ ముగిసే వరకూ కామెంటరీని కొనసాగించిన సునీల్ గవాస్కర్, తన విధులను పూర్తి చేసుకున్న తర్వాత తల్లిని ఆఖరి చూపు చూసుకున్నారు. ఐపీఎల్ 2022 సమయంలో మీనల్ గవాస్కర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంలో తల్లిని చూసుకోవడానికి కామెంటరీకి దూరంగా ఉన్నాడు సునీల్ గవాస్కర్...

ముంబైలో ఓ మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించిన సునీల్ గవాస్కర్, 1966లో ‘ఇండియాస్ బెస్ట్ స్కూల్ బాయ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలిచాడు. 1971లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సునీల్ గవాస్కర్, టీమిండియా తరుపున 125 టెస్టులు ఆడి 10,122 పరుగులు చేశాడు. 108 వన్డేల్లో 3092 పరుగులు చేశాడు..

టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్, 2005 వరకూ అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గానూ రికార్డులు క్రియేట్ చేశాడు. సునీల్ గవాస్కర్ 34 టెస్టు సెంచరీల రికార్డును సచిన్ టెండూల్కర్ అధిగమించి 51 సెంచరీలు బాదాడు. ఆరంగ్రేటం సిరీస్‌లో 774 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్, ఇప్పటికీ తొలి టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. 

click me!