
యావద్భారతవని గర్వంతో ఉప్పొంగుతున్న క్షణాలివి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గతేడాది రికార్డుల ప్రభంజనం సృష్టించి ఇప్పుడు అవార్డులు కొల్లగొడుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ వేదికపై సరగ్వంగా మెరిసింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై దేశమంతా సంబురాలు చేసుకుంటున్న వేళ టీమిండియా క్రికెటర్లు కూడా ఈ సంతోషాలలో భాగమవుతున్నారు. ట్రిపుల్ ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సాధారణంగా టీవీ షోలలో పెద్దగా హంగామా చేయని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్.. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఎగిరి గంతేశారు. ఈ పాటకు కాలు కదిపి డాన్స్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
భారత్ - ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఉదయం స్టార్ స్పోర్ట్స్ (తెలుగు) కామెంటేటర్స్ నాటు నాటు గురించి మాట్లాడుకుంటుండగా అక్కడికి గవాస్కర్ వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ట్రిపుల్ ఆర్ టీమ్ కు శుభాభివందనాలు. సంగీత దర్శకుడు, రచయిత తో పాటు టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు. నేను ఇటీవలే ఆ సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై మరిన్ని అవార్డులు గెలిచేందుకు ఇది పునాది కావాలి...’అని అన్నాడు.
తాను చెప్పడం అయిన తర్వాత గవాస్కర్.. నాటు నాటు పాటకు ఎన్టీఆర్, రాంచరణ్ ల సిగ్నేచర్ మూమెంట్ తో అలరించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
గవాస్కర్ తో పాటు భారత క్రికెటర్లు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. సచిన్ టెండూల్కర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లు ట్రిపుల్ ఆర్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా నాటు నాటు పోస్టర్ లతో రచ్చ చేశాయి.