Asia Cup: కీలక పోరులో బంగ్లా బ్యాటర్ల వీరవిహారం.. లంక ముందు భారీ లక్ష్యం

Published : Sep 01, 2022, 09:23 PM ISTUpdated : Sep 01, 2022, 09:25 PM IST
Asia Cup: కీలక పోరులో బంగ్లా బ్యాటర్ల వీరవిహారం.. లంక ముందు భారీ లక్ష్యం

సారాంశం

Asia Cup 2022:ఆసియా కప్ లో నిలవాలంటే తప్పక రాణించాల్సి ఉన్న  పోరులో బంగ్లా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 

ఆసియా కప్-2022లో భాగంగా దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న  కీలక పోరులో బంగ్లాదేశ్ జూలు విదిల్చింది.  ఆసియా కప్ లో నిలవాలంటే తప్పక రాణించాల్సి ఉన్న  పోరులో బంగ్లా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ మెహిది హసన్ మిరాజ్  (26 బంతుల్లో 38, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు అఫిఫ్ హుస్సేన్ (22 బంతుల్లో 39, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. వీరికి తోడు మహ్మదుల్లా (22 బంతుల్లో 27, 1 సిక్సర్, 1 ఫోర్), ముసద్దేక్ హోసేన్ (9 బంతుల్లో 24 నాటౌట్, 4 ఫోర్లు) కూడా రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్  కు మూడో ఓవర్లో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ షబ్బీర్ రెహ్మాన్ (5) ను అరంగేట్ర బౌలర్ అసిత ఫెర్నాండో  ఔట్ చేశాడు. కానీ మరో ఓపెనర్ మిరాజ్ మాత్రం ధాటిగా ఆడాడు. తీక్షణ వేసిన నాలుగో ఓవర్లో సిక్సర్ బాదిన అతడు.. తర్వాత అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లో 6, 4, 4 బాదాడు. తొలి పవర్ ప్లేలో బంగ్లాదేశ్.. ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. 

బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (24) తో కలిసి రెండో వికెట్ కు  39 పరుగులు జోడించిన మిరాజ్.. హసరంగ వేసిన ఏడో ఓవర్ ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన ముష్ఫీకర్ రహీమ్ (4) ను కరుణరత్నె ఔట్ చేశాడు. కరుణరత్నె వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదిన షకిబ్.. తీక్షణ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

 

ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన  మహ్మదుల్లాతో కలిసి అఫిఫ్ హుస్సేన్ చెలరేగి ఆడాడు. హసరంగ వేసిన 13వ ఓవర్లో 4, 6 బాదాడు. హసరంగ వేసిన 15వ ఓవర్లో మహ్మదుల్లా 6, 4 తో బంగ్లా స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. అసిత ఫెర్నాండో వేసిన 16వ ఓవర్లో అఫిఫ్.. ఓ సిక్సర్, ఫోర్ తో మెరుపులు మెరిపించాడు. కానీ మధుశనక వేసిన 17వ ఓవర్లో అఫిఫ్.. హసరంగకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత మహ్మదుల్లా కూడా హసరంగ వేసిన 18వ ఓవర్లో తొలి బంతికి కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

చివర్లో ముసద్దేక్ హుస్సేన్ ధాటిగా ఆడి బంగ్లా స్కోరును 180 దాటించాడు. లంక బౌలర్లలో హసరంగ, కరుణరత్నె లు తలా రెండు వికెట్లు తీశారు. అసిత ఫెర్నాండో, మహేశ్ తీక్షణ, దిల్షాన్ మధుశనక లు చెరో వికెట్ దక్కించుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

అయ్యో భగవంతుడా.! కావ్య పాప ఇలా చేశావేంటి.. ఈసారి కూడా కప్పు పాయే
T20 World Cup : సంజూ vs గిల్.. భారత జట్టులో చోటుదక్కేది ఎవరికి?