
మన పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంక.. గత కొన్నాళ్లుగా తీవ్ర అప్పులలో కూరుకుపోయింది. దీంతో ద్రవ్యోల్భనం భారీగా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలకు ఏదైనా వ్యాధులు వస్తే వేసుకునే మందులు కూడా ఖరీదయ్యాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని, ప్రజలకు అవసరమైన ఔషదాలను పంపించాలని శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్ ను కోరాడు.
గురువారం జయసూర్య లంకలో ఉన్న భారత హై కమిషనర్ గోపాల్ బగలాయ్ ను కలిశాడు. ఈ సందర్బంగా ఆయన తమకు అవసరమైన నిత్యావసర వస్తువులు, మెడిసన్స్ సప్లై చేయాలని కోరాడు. మింగడానికి మందులు లేక క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపాడు.
ఇక గురువారం బగలాయ్ ను కలిసిన అనంతరం భారత హై కమిషన్ కూడా ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘హై కమిషనర్ బగలాయ్ లంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను కలిశారు. ఆ దేశం తరఫున జయసూర్య ఎన్నో సేవలందించాడు. ఈ సందర్భంగా జయసూర్య.. లంకకు చేస్తున్న సాయంపై ప్రశంసలు కురిపించాడు. ఈసాయం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు...’ అని రాసుకొచ్చింది.
జయసూర్య కూడా తన ట్విటర్ లో స్పందిస్తూ.. ‘ఈ కీలక సమయంలో నాకు సమయం వెచ్చించి సమావేశమైన బగలాయ్ కు ధన్యవాదాలు. లంకకు మానవతా దృక్పథంతో సాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ స్నేహం రెండు దేశాల మధ్య ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నాడు.
ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితం లంకకు పలురకాలుగా సాయం అందించడంపై జయసూర్య భారత్ ను తమకు పెద్దన్నగా అభివర్ణించాడు. సంక్షోభంలో ఉన్న తమ దేశానికి ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.