
సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల క్రియేటివిటీని చూసే అదృష్టం దక్కింది. మీమ్స్‌తో జనాలను కడుపుబ్బ నవ్విస్తూ, క్రియేటివిటీకి పీక్స్‌ని పరిచయం చేస్తున్న నెటిజన్లు, తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్‌ని ఓ ఆటాడుకున్నారు...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్ ఎవరైనా, ఏ దేశం వారైనా బంధం కలుపుకుని, ఆత్మీయంగా దగ్గర చేసుకోవడం తెలుగువారి స్పెషాలిటీ. డేవిడ్ వార్నర్‌ని ‘డేవిడ్ భాయ్’, ‘వార్నర్ భయ్యా’ అంటూ ప్రేమగా పిలిచిన ఆరెంజ్ ఆర్మీ అభిమానులు, కేన్ విలియంసన్‌ని ‘కేన్ మామ’ అంటూ తెగ దగ్గర చేసుకున్నారు...
రషీద్ కాక, బెయిర్‌స్టో బాబాయ్, మనీశ్ అన్న, విజయ్ శంకర్ అన్న.. అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన క్రికెటర్లతో బంధాలు కలుపుకున్నారు. ఇప్పుడు అయిడిన్ మార్క్‌రమ్‌కి కూడా అలాంటి ఓ నిక్ నేమ్ ఇవ్వాల్సిందిగా అభిమానులను కోరింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ పోస్టుకి జనాల నుంచి బీభత్సమైన స్పందన వచ్చింది...
‘మార్క్‌రమ్ మామ’, ‘మార్క్‌రమ్ మామయ్య’ అని కొందరు కామెంట్లు పెడితే మరికొందరు ‘అయిడిన్ అన్న’, ‘కెప్టెన్ రామ్’, అంటూ కొత్త కొత్త నిక్ నేమ్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో అఖిల్ అక్కినేని ‘అయ్యగారే నెం.1’ అన్నట్టుగా, సన్‌రైజర్స్‌కి ‘మార్క్‌రమ్ అయ్యగారు’ గా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు...
మరికొందరు మీమీ పరిజ్ఞానం మెండుగా ఉన్న నెటిజన్లు అయితే ‘మలక్‌పేట్ మార్క్‌రమ్’, ‘మటన్ కొట్టు మార్క్‌రమ్’ అంటూ కొంటె పేర్లతో జనాలను నవ్విస్తున్నారు... అయితే డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్‌లను దగ్గర చేసుకుంటున్నట్టు అయిడిన్ మార్క్‌రమ్‌ని ఓన్ చేసుకుంటారా? అనేది అనుమానమే..
కెప్టెన్‌గా మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ టీమ్‌ని విజేతగా నిలిపిన సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్, ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా రూట్ క్లియర్ చేసుకున్నాడు. #SA20 లీగ్‌కి ముందు కెప్టెన్‌గా అండర్19 వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచాడు అయిడిన్ మార్క్‌రమ్... దీంతో అతనిపై భారీ నమ్మకమే పెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ మేనేజ్‌మెంట్.
గత రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చి ఇద్దరు కెప్టెన్లను బయటికి పంపిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2023 సీజన్ కెప్టెన్ ఎంపిక విషయంలో చాలా కసరత్తే చేసింది. సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కి కెప్టెన్‌గానే కాకుండా బ్యాటుతో బాల్‌తో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అయిడిన్ మార్క్‌రమ్. బ్యాటుతో 311 పరుగులు, బాల్‌తో 11 వికెట్లు తీసి అదరగొట్టాడు అయిడిన్ మార్క్‌రమ్. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచిన మార్క్‌రమ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నడిపించబోతున్నాడు.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషనల్ బ్యాటర్ హారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. గతంతో పోలిస్తే ఈసారి టీమ్ మరింత పటిష్టంగా ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి.