
తిరువనంతపురం వేదికగా ముగిసిన మ్యాచ్ లో భారత్.. లంకపై 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా టీమిండియా 3-0 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ఫ్యాన్స్ చేసిన వింత చేష్టలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఓ అభిమాని.. కోహ్లీ పాదాలను తాకేందుకు యత్నించగా.. మరో ఫ్యాన్ విరాట్ కొట్టిన బంతిని చేతబట్టుకుని ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత కెమెరామెన్ కెమెరాను తనవైపునకు తిప్పగా తన వద్ద ఉన్న ఫోన్ లో ఆ బంతిని చూసుకుంటూ మురిసిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా లాహిరు కుమార 46వ ఓవర్ వేశాడు. కోహ్లీ అప్పుడే సెంచరీ చేసి బ్యాట్ ఝుళిపించేందుకు సిద్దమైన క్షణమది. ఆ ఓవర్లో తొలి బంతిని కోహ్లీ.. లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు.
బంతి వెళ్లి ఫెన్సింగ్ కు తాకి లోపల పడింది. అక్కడే ఉన్న ఓ అభిమాని.. పరిగెత్తుకుని వెళ్లి.. ‘ఆగండాగండి.. నేను తీసిస్తా’అని సైగ చేస్తూ వెళ్లాడు. బంతిని తీసుకుని లంక ప్లేయర్ కు ఇవ్వకుండా జేబులోంచి తన ఫోన్ తీసి.. ‘ఇదిగో ఇది కోహ్లీ సిక్సర్ కొట్టిన బంతి.. నేనే క్యాచ్ పట్టుకున్నా..’ అన్నంత లెవల్ లో ఫోటోలకు ఫోజులిచ్చాడు. వివిధ యాంగిల్స్ లో బంతిని ఫోటో తీసి చివరికి బంతిని గ్రౌండ్ లోకి విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు.. ‘నీకు ఇదేం పైత్యంరా అయ్య.. ఏదో నువ్వు క్యాచ్ పట్టినంతగా బిల్డప్ ఇస్తున్నావ్..?’, ‘నీ ఫోజులు తగలెయ్య.. ఫోటోలు చాలు గానీ ముందు బాల్ ను ఇవ్వురా..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోన్ ఫ్యాన్ ఇలా ఉంటే మరో అభిమాని భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చి కోహ్లీ పాదాలకు మొక్కబోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెటర్లకు పోలీసులు, ఇతర సెక్యూరిటీ వాళ్ల భారీ భద్రత ఉంటుంది. సాధారణ సమయాల్లో అయితే వాళ్లను కలిసే అవకాశం ఉంటుందేమో గానీ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆ భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికెళ్లాలంటే దుస్సాహసమే. నిన్నటి మ్యాచ్ లో ఓ అభిమాని ఇదే దుస్సాహసం చేశాడు. ఇండియా - శ్రీలంక మ్యాచ్ లో లంక బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పోలీసులు, ఇతర సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని కోహ్లీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. కోహ్లీని అభిమానించే సదరు అభిమాని.. అతడి కాళ్లను మొక్కేందుకు యత్నించాడు. అది చూసిన కోహ్లీ.. అతడిని పైకి లేపబోయాడు. అభిమానిని పైకి లేపి భుజం తట్టి అక్కడ్నుంచి పంపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.