బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు.
బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. నాణ్యమైన పేస్ బౌలింగ్ ఎదుర్కొవటంలో సౌరవ్ గంగూలీ బలహీనతపై పలు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అక్తర్ వాటిని తోసిపుచ్చాడు.
ఫాస్ట్ బౌలింగ్ ని, ముఖ్యంగా తనను ఎదుర్కొనేందుకు గంగూలీ భయపడేవాడని చాలా మంది అంటుంటారు కానీ.... అవన్నీ పిచ్చి మాటలని కొట్టి పారేసాడు అక్తర్. తాను బౌలింగ్ చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సౌరవ్ గంగూలీ భయమెరుగని బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చాడు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.
undefined
కొత్త బంతితోపాటు తనను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏకైక ఓపెనర్ గంగూలీయే అని అన్నాడు. ఛాతి ఎత్తులో షార్ట్ పిచ్ బంతులను ఆడటానికి తన వద్ద ఎక్కువ షాట్లు లేవన్న విషయం గంగూలీకి తెలుసునని, తాను ఛాతిని లక్ష్యంగా చేసుకుని షార్ట్ పిచ్ బంతులను సంధించినప్పుడు కూడా అసలు వెనక్కి తగ్గకుండా బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించేవాడని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు.
అందుకే గంగూలీ భయమెరుగని బ్యాట్స్‌మన్ అని తాను అంటున్నానని అక్తర్ అన్నాడు. భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్ గంగూలీ అని, ఎం.ఎస్ ధోని సైతం మంచి కెప్టెనే, కానీ జట్టును నిర్మించటంలో దాదా శైలి అమోఘమని అక్తర్ పొగడ్తల వర్షం కురిపించాడు.
ఇక ఇది ఇలా ఉండగా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఐపీఎల్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నాడు. సెప్టెంబర్, అక్టోబర్ సీజన్లో ఐపీఎల్ జరపాలని బీసీసీఐ మంచి పట్టుదల మీద ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించి రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు గంగూలీ లేఖ రాసారు.
గంగూలీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖ మొదలు ఇక క్రికెట్ వర్గాలు మొత్తం ఐపీఎల్ నిర్వహణ గురించిన చర్చే సాగుతోంది. ఈ చర్చ సాగుతుండగానే.... ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉందని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు.
'ఐపీఎల్ నిర్వహణకు మేం సిద్ధంగా ఉన్నాం. టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఐపీఎల్ ప్రణాళిక ఆరంభం కానుంది. త్వరలోనే ఐసీసీ దీనిపై తేల్చుతుందని ఆశిస్తున్నాం. మావైపు నుంచి సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం. సెప్టెంబర్-అక్టోబర్ విండో ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్యూలే. ఐసీసీ అధికారిక ప్రకటన అనంతరం తుది నిర్ణయం ఉంటుంది. ఆలోగా ప్రణాళికకు రంగం సిద్ధం చేసుకుంటున్నాం' అని బ్రిజేష్ పటేల్ అన్నారు.
ఐపీఎల్ నిర్వహణ ఖచ్చితంగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ వేదిక ఎక్కడ అనే దానిపై చర్చ జోరందుకుంది. విదేశాల్లోనా ఇక్కడ అనే అంశం గురించి బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. ఎక్కడైనా ప్రేక్షకులకు ఎంట్రీ ఉండదు కాబట్టి ఎక్కడ తేలికగా ఉంటె అక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది.