
బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో గెలిచిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత మహిళా జట్టు, మొదటి వన్డేలో 113 పరుగులకి ఆలౌట్ అయ్యి, 40 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. రెండో వన్డేలో 108 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ని చిత్తు చేసి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆఖరి ఓవర్ వరకూ పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది..
52 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఈజీగా గెలిచేలా కనిపించిన భారత మహిళా జట్టు, ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోయి 225 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో మూడో వన్డే టైగా ముగిసింది. మ్యాచ్ పూర్తి అయ్యే సమయానికి షెడ్యూల్ టైం కూడా అయిపోవడంతో సూపర్ ఓవర్ పెట్టేందుకు రిఫరీ అంగీకరించలేదు..
ఈ మ్యాచ్‌లో అంపైర్ల కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్. ఈ కారణంగా ఈజీగా వన్డే సిరీస్ గెలవాల్సిన భారత జట్టు, కేవలం టీ20 సిరీస్‌తోనే స్వదేశానికి రానుంది..
‘ఈ మ్యాచ్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. క్రికెట్‌ని పక్కనబెడితే ఈ విధమైన అంపైరింగ్ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఈసారి బంగ్లాదేశ్ పర్యటనకి వస్తే, ఇలాంటి అంపైరింగ్‌ని ఎలా డీల్ చేయాలో తెలుసుకుని వస్తాం..
బంగ్లాదేశ్ బ్యాటర్లు బాగా బ్యాటింగ్ చేశారు. సింగిల్స్ తీయడం ఎంత ముఖ్యమో చేసి చూపించారు. మధ్య ఓవర్లలో మేం కొన్ని పరుగులు ఈజీగా ఇచ్చేశాం. అయితే మేం గేమ్‌ని బాగా కంట్రోల్ చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాం. ముందుగా చెప్పినట్టు చెత్త అంపైరింగ్ చేశారు. కొన్ని నిర్ణయాలు మమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచాయి..
హర్లీన్ డియోల్ గత మ్యాచ్‌లో చక్కగా బ్యాటింగ్ చేసింది. అందుకే ఆమెను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేశాం. ఆమె ఈ అవకాశాన్ని చక్కగా వాడుకుంది. జెమీ (జెమీమా రోడ్రిగ్స్) ఆఖరి వరకూ బాగా ఆడింది. మంచి మ్యాచ్.. చాలా విషయాలు నేర్పింది..
చివరగా ఇండియా హై కమీషన్ కూడా ఇక్కడికి వచ్చింది. మీరు వాళ్లను స్టేజీ పైకి పిలుస్తారని అనుకున్నా. అయినా పర్లేదు. జనాలు మాకు చక్కగా సపోర్ట్ చేశారు... అందరికీ థ్యాంక్యూ...’ అంటూ మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్..
ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నహీదా అక్తర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, బెయిల్స్‌ని కాలితో తన్నుతూ అంపైర్‌ని తిడుతూ పెవిలియన్ చేరింది.. హర్మన్‌ప్రీత్ కౌర్ అవుట్, మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది.