
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రెండు నెలల ముందు శ్రీలంక జట్టుకి ఊహించని షాక్ తగిలింది. శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ లహిరు తిరిమన్నె, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన లహిరు తిరిమన్నె, మూడు ఫార్మాట్లలో కలిపి దాదాపు 200 మ్యాచులు ఆడాడు..
44 టెస్టులు ఆడిన లహిరు తిరిమన్నె, 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 2088 పరుగులు చేశాడు. 127 వన్డేల్లో 34.77 సగటుతో 3164 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 26 టీ20 మ్యాచులు ఆడిన లహిరు తిరిమన్నె, 291 పరుగులు చేశాడు...
టీ20 వరల్డ్ కప్ 2014 టోర్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్... ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ‘గత కొన్నేళ్లుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. గడిచిన ఏళ్లలో క్రికెట్ గేమ్ నాకు ఎంతో ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నా అని ప్రకటిస్తున్నా..
ఓ ప్లేయర్‌గా టీమ్ కోసం నేను బెస్ట్ ఇచ్చాను. క్రికెట్ అంటే నాకెంతో గౌరవం ఉంది. నా విధిని నేను నిజాయితీగా, న్యాయబద్ధంగా నిర్వహించి, నా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ప్రయత్నించా. ఇది అత్యంత క్లిష్టమైన నిర్ణయమే కానీ తీసుకోక తప్పదు. దీనికి అనేక ఊహించని కారణాలు ఉన్నాయి, వాటిని బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. అయితే నేను ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరి ప్రోద్భలం లేదు...
నాకు శ్రీలంక క్రికెట్ టీమ్ తరుపున ఆడే అవకావం కల్పించిన ఎస్‌ఎల్‌సీ సభ్యులకు, నా కోచ్‌లకు, టీమ్ మేట్స్‌కి, ఫిజియోలకు, ట్రైయినర్లకు, అనాలసిస్ట్‌లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి ముఖ్యంగా నా అభిమానులకు, సపోర్టర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా... మీరు చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా..’ అంటూ రాసుకొచ్చాడు లహిరు తిరిమన్నె..
33 ఏళ్ల లహిరు తిరిమన్నె, 2010లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. తిలకరత్నే దిల్షాన్ గాయపడడంతో తుది జట్టులోకి వచ్చిన, ఆస్ట్రేలియాపై ఆడిలైడ్ ఓవల్‌లో మొట్టమొదటి వన్డే సెంచరీ బాదాడు. 2016లో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన లహిరు తిరిమన్నే, 2022 భారత పర్యటనలో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2019 తర్వాత వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్న లహిరు తిరిమన్నె, 2014 ఆసియా గేమ్స్‌లో శ్రీలంక జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించి, గోల్డ్ మెడల్ అందించాడు.