అర్రే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..? ఈ శ్రీలంక క్రికెటర్ దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడుగా..

By team teluguFirst Published Nov 22, 2021, 4:42 PM IST
Highlights

Dhananjaya De Silva: శ్రీలంక-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక క్రికెటర్ ధనంజయ డి సిల్వా చిత్రమైన రీతిలో క్రీజును వీడాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

వెస్టిండీస్-శ్రీలంక మధ్య గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో వింతలు విశేషాలు నమోదవుతున్నాయి. విశేషాలంటే బ్యాటర్ల త్రిబుల్ సెంచరీలో బౌలర్ల పది వికెట్ల ప్రదర్శనలో అనుకునేరు.. ఇప్పటికైతే అలాంటివేమీ లేవు.  నిన్న ప్రారంభమైన తొలి టెస్టులో.. ఆ జట్టు  మిడిలార్డర్  బ్యాటర్ ధనంజయ డి సిల్వా నిష్క్రమించిన తీరు చూస్తే దురదృష్టమంటే ఇతడిదే అనిపించక మానదు. 61 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన అతడు.. హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అయితే అతడు ఔటైన విధానమే ఇక్కడ వింత. 

తొలి రోజు ఆటలో భాగంగా..  టాస్ గెలిచి శ్రీలంక  బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన లంక ఓపెనర్లు  మంచి శుభారంభాన్నందించారు. ఆట ముగుస్తుందనగా..  విండీస్ బౌలర్ గాబ్రియేల్ 95 వ ఓవర్ వేశాడు. లంక స్కోరు 281-3 గా ఉంది. అప్పటికీ ఓపెనర్ గా వచ్చి సెంచరీ చేసిన కరుణరత్నే (147), ధనంజయ డి సిల్వా (61) క్రీజులో ఉన్నారు. అయితే ఆ ఓవర్లో గాబ్రియెల్ వేసిన నాలుగో బంతిని డిసిల్వా డిఫెన్స్ ఆడాడు. అది ఎడ్జ్ తీసుకుని  డిసిల్వా వెనకున్న స్టంప్స్ ను తాకబోయింది.  

ఈ క్రమంలో బంతిని స్టంప్స్ కు తగలకుండా ఉండేందుకు డి సిల్వా బ్యాట్ తో ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్ తో బెయిల్స్ ను పడగొట్టాడు. ఇంకేముంది.. తొలి రోజు ముగిసేసరికి లంక మరో వికెట్ కోల్పోయింది. అయితే ఇలా హిట్ వికెట్ గా వెనుదిరగడం డి సిల్వాకు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతడు ఓసారి హిట్ వికెట్ గా ఔటయ్యాడు. శ్రీలంక తరఫున టెస్టుల్లో రెండు సార్లు హిట్ వికెట్ గా వెనుదిగిరగిన రెండో ఆటగాడిగా డి సిల్వా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రొమేష్ కలువితరణ పేరుమీద ఉంది. 

ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 386 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే ఔటయ్యాక  వికెట్ కీపర్ చండిమాల్ (45 )ఒక్కడే విండీస్ బౌలర్లను కాస్త ప్రతిఘటించాడు. ఆ తర్వాత వచ్చినవాళ్లంతా వెంటవెంటనే నిష్క్రమించారు.  విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ కు 5 వికెట్లు దక్కగా.. వార్రికన్ మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన  వెస్టిండీస్.. 26 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రాత్ వైట్ (30 నాటౌట్), హోప్ ఆడుతున్నారు.  

click me!