
రెండు పొట్టి ప్రపంచకప్పులు గెలిచినా ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజీలోనే ఇంటి ముఖం పట్టిన వెస్టిండీస్ కు మరో భారీ షాక్ తగిలింది. శ్రీలంక పర్యటనలో ఉన్న ఆ జట్టు యువ ఆటగాడు అనూహ్య రీతిలో గాయపడ్డాడు. గాలె వేదికగా వెస్టిండీస్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ ఆటగాడు జెరెమీ సోలోజానో తీవ్రంగా గాయపడ్డాడు. ఆట తొలి సెషన్ లో 24వ ఓవర్ లో ఈ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ రోస్టన్ చేజ్ వేసిన ఓ బంతిని ఆడబోయిన కరుణరత్నే.. దానిని బలంగా బాదాడు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సోలోజానో హెల్మెట్ కు గట్టిగా తాకడంతో అతడి తలకు గాయమైంది.
విషయంలోకి వెళ్తే.. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్నది. నేడు గాలే లో తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన లంకేయులు.. తొలుత బ్యాటింగ్ కు దిగారు. అయితే ఇన్నింగ్స్ 24 వ ఓవర్ నాలుగో బంతిని విండీస్ బౌలర్ రోస్టన్ చేజ్.. శ్రీలంక కెప్టెన్ కరుణరత్నేకు షార్ట్ డెలివరీగా సంధించాడు. కరుణరత్నే దానిని షార్ట్ లెగ్ దిశగా బలంగా బాదాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జెరెమీ హెల్మెట్ కు అంతే బలంగా తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
బంతి బలంగా తాకడంతో జెరెమీ కిందపడి విలవిల్లాడాడు. హెల్మెట్ లోని ఓ భాగం అతడి తలకు గట్టిగా తాకినట్టు తెలుస్తున్నది. దీంతో విండీస్, శ్రీలంక ఆటగాళ్లు జెరెమీ దగ్గరకు వచ్చి ఓదార్చారు. కానీ నొప్పి ఎక్కువవడంతో ఫిజియో వచ్చిఅతడిని పరీక్షించాడు. దెబ్బ బలంగా తాకడంతో అతడిని వెంటనే అక్కడ్నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ అనూహ్య పరిణామంతో విండీస్, శ్రీలంక క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తొలి టెస్టు ఆడుతున్న జెరెమీ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులతో పాటు వాళ్లు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, రెండ్రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో తెలిపింది.
ఇదిలాఉండగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక 72 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు నిస్సంక (56), సారథి దిముత్ కరుణరత్నే (105 నాటౌట్) ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. కరుణరత్నే సెంచరీతో ఆ జట్టు భారీ స్కోరుకు పునాదులు వేశాడు. ఓపెనర్లిద్దరూ కలిసి తొలి వికెట్ కు 139 పరుగులు జోడించారు. కానీ నిస్సంక ఔట్ కాగానే.. ఫెర్నాండో, మాథ్యూస్ లు త్వరత్వరగానే నిష్క్రమించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (19 బ్యాటింగ్) తో కలిసి కరుణరత్నే లంకను భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్.. 2 వికెట్లు తీసుకున్నాడు.