మతం మారాలని నన్ను తీవ్ర ఒత్తిడి చేశాడు: అఫ్రిది పై పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

Published : May 05, 2022, 03:48 PM IST
మతం మారాలని నన్ను తీవ్ర ఒత్తిడి చేశాడు: అఫ్రిది పై పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Danish kaneria On Shahid Afridi: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా..  ఆ జట్టు మాజీ  ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది పై సంచలన కామెంట్స్ చేశాడు. అతడు తనను మతం మారమని ఒత్తిడి చేశాడని ఆరోపించాడు. 

పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిపై వరుసగా విమర్శల జడివాన కురిపిస్తున్న ఆ జట్టు మాజీ  స్పిన్నర్ దానిష్ కనేరియా మరోసారి విరుచుకుపడ్డాడు. ఈసారి ఏకంగా తన మతానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది తనను మతం మారాలని ఒత్తిడి చేశాడని, కానీ అతడి ఒత్తిళ్లకు తాను లొంగలేదని  తెలిపాడు. తనను జట్టులోంచి పంపించేందుకు అఫ్రిది చేయని కుట్ర లేదని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఐదు రోజుల క్రితం  అక్కడి ఓ ప్రముఖ మీడియా  సంస్థతో మాట్లాడుతూ అఫ్రిది పై తీవ్ర ఆరోపణలు చేసిన అనంతరం తాజాగా అతడు భారత్ కు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

కనేరియా మాట్లాడుతూ.. ‘మేమిద్దరం (అఫ్రిది, కనేరియా) కలిసి ఆడినప్పుడు  అతడు నన్ను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడు.  పదే పదే దాని గురించి మాట్లాడేవాడు. కానీ నేను మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు...

నా మతాన్ని నేను నమ్ముకున్నాను.  దానివల్ల నా క్రికెట్ కెరీర్ కు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. నా ఆట నేను ఆడాను..’ అని తెలిపాడు. హిందూను అవడం వల్లే జట్టులొ తాను ఇబ్బందులు ఎదుర్కున్నానని  కనేరియా నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ఈ విషయం గురించి  జట్టులో అందరికంటే ముందుగా షోయభ్ అక్తర్ మాట్లాడాడని కానీ పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా తర్వాత అతడు కూడా నోరు తెరవలేదని  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

 

అఫ్రిది.. తాను సారథిగా (వన్డేలకు) ఉన్నప్పుడు తనను ఎక్కువగా బెంచ్ కే పరిమితం చేసేవాడని,  జట్టులో చోటు దక్కకుండా చేయడానికి చాలా కుట్రలు చేశాడని చెప్పుకొచ్చాడు. కానీ సీనియర్ ప్లేయర్లు ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్, అక్తర్, మోయిన్ ఖాన్, రషీద్ లతీఫ్ లు తనకు మద్దతుగా నిలిచేవారని తెలిపాడు. 

తనతో అఫ్రిదికి వ్యక్తిగత విబేధాలేమీ లేవని, కానీ అతడు మాత్రం తనతో ఎప్పుడూ  సఖ్యంగా ప్రవర్తించేవాడు కాదని కనేరియా  అన్నాడు. తన కెరీర్ లో ఇవన్నీ తనను చాలా ఇబ్బందులకు గురి చేశాయని  చెప్పాడు.  

2012లో అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా పీసీబీ  అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. దానిమీద మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో అఫ్రిది నాకు ఇసుమంత సాయం కూడా చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే  నాకు ఇలా జరిగినందుకు అతడు చాలా సంతోషించాడు. ఈ కేసులో నామీద వేసిన ఆరోపణలను  తప్పు అని రుజువు చేసేందుకు కూడా నాకు  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవకాశమివ్వలేదు..’ అని తెలిపాడు. పాకిస్తాన్ తరఫున 2000 నుంచి 2010 వరకు ఆడిన  కనేరియా.. 61 టెస్టులాడాడు. టెస్టులలో ఏకంగా 261 వికెట్లు పడగొట్టాడు.  కానీ వన్డేలలో మాత్రం  కనేరియా.. 18 మ్యాచులు మాత్రమే ఆడాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన