రవీంద్ర జడేజా దెబ్బ: సంజయ్ మంజ్రేకర్ పై బీసీసీఐ వేటు

By telugu teamFirst Published Mar 14, 2020, 4:07 PM IST
Highlights

క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పై బీసీసీఐ వేటు వేసింది. కామెంట్రీ ప్యానెల్ నుంచి ఆయనను తొలగించింది. గతంలో రవీంద్ర జడేజా, హర్షా బోగ్లే విషయంలో చేసిన వ్యాఖ్యల కారణంగానే సంజయ్ మంజ్రేకర్ ను తప్పించినట్లు చెబుతున్నారు.

ముంబై: క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పై బీసీసీఐ వేటు వేసింది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రికెట్ వ్యాఖ్యాతగా అతని ప్రదర్శన సరిగా లేదనే ఉద్దేశంతో బీసీసీఐ అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజాపై సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

మరో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లేపై కూడా మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు రవీంద్ర జడేజా బహిరంగంగానే విరుచుకుపడ్డాడు. ఈ స్థితిలోనే ఆయనను క్రికెట్ వ్యాఖ్యతగా తొలగించినట్లు తెలుస్తోంది. కామెంట్రీ ప్యానెల్ నుంచి సంజయ్ మంజ్రేకర్ ను బీసీసీఐ తప్పించింది. 

ధర్మశాలలో గురువారం దక్షిణాఫ్రికాతో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ కు మిగతా వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, ఎల్ శివరామకృష్ణన్, మురళీ కార్తిక్ హాజరయ్యారని, సంజయ్ మంజ్రేకర్ మాత్రం హాజరు కాలేదని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. 

కామెంట్రీ ప్యానెల్ నుంచి ఆయనను తప్పించడానికి గల కారణాలు తెలియరాలేదు గానీ ఆయన పనితీరు బీసీసీఐకి నచ్చలేదని అంటున్నారు. ఐపీఎల్ ప్యానెల్ నుంచి కూడా ఆయనను తొలగించే అవకాశాలున్నాయి. ఐపిఎల్ ప్యానెల్ నుంచి కూడా మంజ్రేకర్ ను తొలగించే అవకాశం ఉందని,  మంజ్రేకర్ పనితీరు పట్ల అధికారులు సంతోషంగా లేరని ఓ ఉన్నతాధికారి అన్నట్లు ఆ పత్రిక రాసింది. 

మంజ్రేకర్ పై నిరుడు రెండుసార్లు సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. మొదట రవీంద్ర జడేజాపై, ఆ తర్వాత హర్షా బోగ్లేపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. సంజయ్ మంజ్రేకర్ క్షమాపణలు చెప్పినా వారు వదిలిపెట్టలేదు.

click me!