2011 ప్రపంచ కప్ విజయం: టెండూల్కర్ కు ప్రతిష్టాత్మక అవార్డు

By telugu teamFirst Published Feb 18, 2020, 11:12 AM IST
Highlights

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రతిష్టాత్మకమైన లారస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును అందుకున్నాడు. భారత క్రికెటర్లు అతన్ని భుజాలపై మోసిన అపూర్వమైన ఘటనకు సచిన్ ఆ అవార్డు గెలుచుకున్నాడు.

బెర్లిన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకున్నాడు. 2011 ప్రపంచ కప్ ను గెలుచుకున్న సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ ను తమ భుజాలపై ఎత్తుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందుకుగాను అతను లారస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. 

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ధోనీ శ్రీలంక పేసర్ కులశేఖర వేసిన బంతిని భారీ సిక్స్ గా మిలిచి రెండో సారి ఇండియాను ప్రపంచ విజేతగా నిలిపాడు. ఆ సమయంలో భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ ను తన భుజాలపై ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. 

దాంతో సచిన్ టెండూల్కర్ కు అత్యధిక ఓట్లు రావడంతో లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అతన్ని విజేతగా ప్రకటించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా సచిన్ టెండూల్కర్ కు అవార్డు అందజేశాడు. 

అవార్డును స్వీకరించిన తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడాడు. అప్పటి ఆనందాన్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నాడు. అదో అద్భుతమని, ప్రపంచ కప్ గెలవడం మాటల్లో చెప్పలేనదని అన్నాడు. ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కోరుకునే  విధమైన సంఘటనలు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే జరుగుతాయని అన్నారు. దానికి దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుందని అన్నారు. ఇప్పటికీ ఆ తీపి గుర్తు తనతోనే ఉందని చెప్పాడు. 

తనకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు 1983లో తన ప్రయాణం ప్రారంభమైందని, అప్పుడే భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలిచిందని, దాని ప్రాముఖ్యం ఏమిటో తనకు అప్పుడు అర్థం కాలేదని, అందరూ సంబరాలు చేసుకుంటుంటే తాను కూడా అందులో కలిసిపోయానని టెండూల్కర్ చెప్పాడు. 

అయితే, ఎక్కడో, ఏదో దేశానికి ఓ ప్రత్యేకమైంది జరిగిందనేది అర్థమైందని ఆ ప్రత్యేకత తన జీవితంలో కూడా జరగాలని అనుకున్నానని, 2011లో తాము ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన జీవితంలో అదో గర్వకారమైన సందర్భమని ఆయన అన్నాడు. 

దక్షిణాఫ్రికా సూర్యుడు నెల్సన్ మండేలా తనపై తీవ్రమైన ప్రభావం వేశాడని, అతను చెప్పిందాంట్లో తనకు నచ్చింది ఒక్కటి ఉందని, అందరినీ ఏకతాటిపైకి తెచ్చే శక్తి క్రీడలకు ఉందని, మండేలా ఎదుర్కున్న కఠినమైన పరిస్థితులు అతను నాయకుడిగా ఎదగడానికి అడ్డుపడలేదని అన్నారు. తాను గెలిచి ఈ ట్రోఫీ తన ఒక్కడిది మాత్రమే కాదు, మన అందరిదీ అని సచిన్ టెండూల్కర్ అన్నాడు.

click me!