
భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే పాజిటివ్‌గా వచ్చిన ఆరు రోజుల తర్వాత సచిన్ ఆసుపత్రిలో చేరారు.
తాను ఆసుపత్రిలో చేరిన విషయాన్ని మాస్టర్ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని.. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరానని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఇంటికి తిరిగి వస్తానని.. తన కోసం ప్రార్థించినందుకు అందరికీ సచిన్ కృతజ్ఞతలు చెప్పారు.
2011 ప్రపంచకప్ సాధించి ఈరోజుతో సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని... ఈ సందర్భంగా భారతీయులకు, సహచరులకు టెండూల్కర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, సచిన్‌కు మార్చి 27న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్‌లో వున్నారు. అయితే ముందు జాగ్రత్తగా నిర్వహించిన పరీక్షల్లో సచిన్ కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది.
ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. సచిన్‌తో పాటు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
మరోవైపు భారత క్రికెట్ జట్టు రెండవసారి ప్రపంచకప్ సాధించి పదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో సినీ నటుడు ఫర్హాన్ అక్తర్ సచిన్ ఫోటోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు. ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్.. మ్యాన్ ఆఫ్ ది టీమ్.. అన్ని సచినే కావడం విశేషం. ఈరోజు చరిత్రలో మిగిలిపోతుందని అక్తర్ ట్వీట్ చేశారు.