IPL 2021 RCB vs RR: బెంగళూరు ఘన విజయం.. రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇక అస్సామే...!

By team teluguFirst Published Sep 29, 2021, 11:08 PM IST
Highlights

IPL 2021 RCB vs RR:కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ బాధ్యతాయుతంగా ఆడిన బెంగళూరు జట్టు.. ప్లే ఆఫ్ కు మరింత దగ్గరైంది. 

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో రాజస్థాన్ చేతులెత్తేసింది. బుధవారం దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ జట్టు పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు బాగా ఆడినా మిడిలార్డర్ వైఫల్యంతో 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు ముందుంచుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు.. ఛేదనలో మూడు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. తాజా విజయంతో బెంగళూరు దాదాపు ప్లే ఆఫ్ చేరినట్టే కాగా రాజస్థాన్ జట్టు ఆశలను వదులుకున్నట్టే..

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి (25), దేవదత్ పడిక్కల్ (22) శుభారంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ రెండో బంతినే ఫోర్ గా మలచిన కోహ్లి.. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. కెప్టెన్ జోరుకు పడిక్కల్ కూడా జతకలిసినట్టు కనిపించినా ఐదో ఓవర్ లో ముస్తాఫిజుర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పడిక్కల్ ఔటయ్యాక నెమ్మదించిన కోహ్లి కూడా ఎక్కువసేపు నిలువలేదు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పరాగ్ అద్భుతమైన త్రో తో రనౌట్ గా వెనుదిరిగాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడ్డ తర్వాత బెంగళూరు బ్యాటింగ్ లో జోరు తగ్గింది. వన్ డౌన్ బ్యాట్స్మెన్ శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 44) తో కలిసి గ్లెన్ మ్యాక్స్వెల్ (30 బంతుల్లో 50 నాటౌట్) స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడుతూ అవసరమైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ బాధ్యతాయుతంగా ఆడారు. ఈ క్రమంలో మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

తన శైలికి భిన్నంగా ఆడిన మ్యాక్సీ.. 26 పరుగుల వద్దకు చేరుకోగానే టీ20 ఫార్మాట్ లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తర్వాత బౌలింగ్ కు దిగిన ముస్తాఫిజుర్ ఈ జోడీని విడదీశాడు. షాట్ బాల్ ను పుల్  చేయబోయి ఫైన్ లెగ్ లో ఉన్న రావత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భరత్ ఔటవ్వగానే  గేరు మార్చిన మ్యాక్స్వెల్  17వ ఓవర్ వేసిన క్రిస్ మోరిస్ కు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్ లో వరుసగా  ఓ సిక్స్, మూడు ఫోర్లతో 22 పరుగులు రాబట్టి ఆర్సీబీకి మరో విజయాన్ని అందించాడు. 
 

click me!