IPL 2021 RCB vs RR: తేలిపోయిన రాజస్థాన్ బ్యాటింగ్.. బెంగళూరు లక్ష్యం 150

By team teluguFirst Published Sep 29, 2021, 9:30 PM IST
Highlights

IPL 2021 RCB vs RR: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్  పేలవ బ్యాటింగ్ చేసింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సంజూ టీమ్..  తొమ్మిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.  డూ ఆర్ డై మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. బెరుకు లేకుండా ఆడిన  రాజస్థాన్ ఓపెనర్లు లూయిస్ (37 బంతుల్లో 58), జైస్వాల్ (22 బంతుల్లో 31)  రెండు ఓవర్ల తర్వాతనే బ్యాట్ కు పనిచెప్పారు. వరుస ఓవర్లలో సిక్సులు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికే రాజస్థాన్ వికెట్లేమీ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. 

తొలి పవర్ ప్లే ముుగిసే సమయానికి రాయల్స్ స్కోరు 71/0 గా ఉంది. తర్వాత ఓవర్ వేసిన క్రిస్టియన్ బౌలింగ్ లో జైస్వాల్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత బంతికే సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జైస్వాల్ అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (19) రెండు సిక్స్ లు కొట్టి ఊపు మీద కనిపించినా పెద్దగా ఆకట్టుకోలేదు. మరోవైపు లూయిస్ ఫోర్లు,  సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఇదే క్రమంలో  హర్షల్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్ లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ  పూర్తి చేశాడు. 

11 ఓవర్లో గార్టన్ వేసిన బంతిని కీపర్ క్యాచ్ ఇచ్చి లూయిస్ ఔటయ్యాడు. అనంతరం తర్వాత  వచ్చిన లోమ్రర్ (3) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు.  షాబాజ్ అహ్మద్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి శాంసన్ నిష్క్రమించగా.. ఆఖరు బంతికి రాహుల్ తెవాటియా కూడా పడిక్కల్ కు క్యాచ్ వెనుదిరిగాడు. శాంసన్ ఔటయ్యేటప్పటికీ రాజస్థాన్ స్కోరు 13 ఓవర్లలో 113/4 గా ఉంది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ రాహుల్ తెవాటియా, లివింగ్ స్టోన్ పెద్దగా బ్యాట్ కు పని చెప్పకుండానే వెనుదిరిగారు. దీంతో స్కోరు వేగం కూడా నెమ్మదించింది.

రియాన్ పరాగ్ (6), క్రిస్ మోరిస్ (14) క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. తొలి పది ఓవర్లలో ఇరగదీసిన రాజస్థాన్.. చివరి ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 30 పరుగులే చేయడం గమనార్హం. ఆఖరు ఓవర్లో బౌలింగ్ వేసిన హర్షల్ పటేల్ వరుస బంతుల్లో  పరాగ్, మోరిస్ లను వెనక్కి పంపి మరోసారి హ్యాట్రిక్ కు దగ్గరగా వచ్చాడు. కానీ కార్తీక్ త్యాగి ఆ అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు బౌలర్లలో హర్షల్  మూడు వికెట్లు తీయగా చాహల్, అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

click me!