డెవిల్ విధ్వంసాన్ని ఆపలేం.. అందుకే కట్టేయాలి: గేల్‌ను టీజ్ చేసిన అశ్విన్

By Siva KodatiFirst Published Oct 21, 2020, 8:10 PM IST
Highlights

అశ్విన్‌.. గేల్‌ షూలేస్‌ను కట్టి సరిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను అశ్విన్‌ సరదా క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు

విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తుది జట్టులోకి అడుగుపెట్టాకా ఆ జట్టు తీరే మారిపోయింది. గేల్ రాకముందు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఎప్పుడయితే గేల్ అడుగు పెట్టాడో.. అప్పటి నుంచి పంజాబ్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగులే చేసినా అతను ఆడిన ఇన్నింగ్స్ వల్లే పంజాబ్ విజయం సాధించింది. 

కాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అంతకుముందు ఇద్దరి మధ్యా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గేల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతని షూ లేస్‌ ఒకటి ఊడిపోయింది.

ఈ సందర్భంగా అశ్విన్‌.. గేల్‌ షూలేస్‌ను కట్టి సరిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను అశ్విన్‌ సరదా క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. 'డెవిల్‌ చూడడానికి భయంకరంగా ఉంటుంది.

అది చేసే విధ్వంసం కూడా అలాగే ఉంటుంది. ఇదే తరహా పోలిక నాకు గేల్‌లోనూ కనబడుతుంది. అందుకే గేల్‌ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్‌ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈరోజు కఠినమైన రోజు. కానీ వచ్చే మ్యాచ్‌లో విజయంతో ఫుంజుకొని తిరిగి బలంగా తయారవుతాం ' అంటూ అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.

నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 165 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. సమిష్టి కృషితో రాహుల్ సేన విజయం సాధించింది. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న పంజాబ్‌ తన తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది.


 

click me!