IPL 2021 RCB vs RR: జోష్ లో రాయల్ ఛాలెంజర్స్.. ఒత్తిడిలో రాజస్థాన్ రాయల్స్.. కీలక పోరులో గెలుపెవరిదో..?

By team teluguFirst Published Sep 29, 2021, 5:22 PM IST
Highlights

IPL 2021 RCB vs RR: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో తొలుత తడబడ్డా తిరిగి పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అనూహ్య పరాజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న రాజస్థాన్ లు మరో కీలక సమరానికి రెడీ అయ్యాయి. 

ఐపీఎల్ 14 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేటి సాయంత్రం కీలక సమరానికి తెరలేవనుంది. దుబాయ్ వేదికగా  రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ లో  గెలిచి ప్లే ఆఫ్ కు ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకోవాలని బెంగళూరు చూస్తున్నది. మరోవైపు ఈ మ్యాచ్ లో నైనా నెగ్గి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని రాజస్థాన్ భావిస్తున్నది. 

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు.. ఇంకా ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ కు చేరినట్టే.  ఈ మ్యాచ్ ఓడినా తర్వాత వారికి మరో మూడు మ్యాచ్ లు ఉన్నాయి. కానీ పాయింట్స్ టేబుల్ లో చివరి నుంచి రెండో  స్థానంలో ఉన్న రాజస్థాన్ కు మాత్రం తర్వాత ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే.

జట్ల బలాబలాలు :
రెండ్రోజుల క్రితం ముంబయితో జరిగిన మ్యాచ్ లో గెలిచి జోష్ మీదున్న బెంగళూరు.. బ్యాటింగ్, బౌలింగ్ లలో సమతూకంగా ఉంది. బ్యాటింగ్ లో కింగ్ కోహ్లి  ఫామ్ లోకి రాగా.. పడిక్కల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ముంబయితో మ్యాచ్ లో మ్యాక్స్వెల్ కూడా టచ్ లోకి వచ్చాడు. డివిలియర్స్ విఫలమవుతున్నా ఈ మ్యాచ్ తో అయినా మిస్టర్ 360 మెరుపులు మెరిపించాలని బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్ లో హర్షల్ పటేల్, చాహల్ రాణిస్తున్నారు.  వికెట్లేమీ తీయకపోయినా సిరాజ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. 

ఇక రాజస్థాన్ విషయానికొస్తే..  ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ మినహా మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమవుతుండటం రాజస్థాన్ ను ఆందోళనకు గురిచేస్తున్నది. ఓపెనర్ జైస్వాల్ తో పాటు ఫినిషర్ డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ లు విఫలమవుతున్నారు. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ తో పోటీ పడ్డ రాజస్థాన్.. స్వీయ తప్పిదాలతో ఓడిపోయింది. ఇది పునరావృతం కాకూడదని  రాజస్థాన్ భావిస్తున్నది. బౌలింగ్ లో కార్తీక్ త్యాగి, సకారియా, ముస్తాఫిజుర్ రాణిస్తున్నా..  బ్యాటింగ్ వైఫల్యమే ఆ జట్టుకు కష్టాలు తెచ్చి పెడుతున్నది. 
ఐపీఎల్ లో ఇరు జట్లు 23 సార్లు తలపడగా.. ఆర్సీబీ 11 సార్లు నెగ్గగా రాజస్థాన్ 10 సార్లు గెలిచింది. ప్రస్తుత సీజన్ లో భాగంగా గత ఏప్రిల్ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పదివికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేగాక గత ఐదు మ్యాచ్ లకు గాను మూడింటిలో ఆర్సీబీనే గెలవడం గమనార్హం. 

జట్లు అంచనా: రాజస్థాన్ : ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, లోమ్రర్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా

ఆర్సీబీ : విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్టియన్, కైల్ జమీసన్, అహ్మద్, హర్షల్ పటేల్, చాహల్, సిరాజ్

click me!