
ఐపిఎల్.... ధనా ధన్ ఇన్నింగ్సులు, కళ్లు చెదిరే సిక్సర్లు, బ్యాట్ మెన్స్ వీరబాదుడు, చీర్ గల్స్ చిందులతో అభిమానులకు క్రికెట్ మజా ఏంటో రుచిచూపించింది. అయితే ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఈ ఐపిఎల్ మజాకు మరింత ఎంటర్ టైన్ మెంట్ తోడయ్యింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమాని తన విచిత్రమైన డ్యాన్స్ తో మైదానంలోని అభిమానులనే కాదు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన సెలబ్రిటీలను సైతం ఆకట్టుకున్నాడు. ఎంతలా అంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో తమను ఆ అభిమాని ఎంతగానో ఎంటర్ టైన్ చేశాడని హీరోయిన్ ప్రీతీజింటా ట్విట్టర్ లో ప్రశంసించిందంటే అతడెంతలా ఆకట్టుకున్నాడో మీరే అర్థం చేసుకోవచ్చు.
ఆ అభిమాని డ్యాన్స్ మైదానంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ప్రీతీజింటా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై ఈ విధంగా కామెంట్ చేశారు. '' ముంబై-పంజాబ్ ల మధ్య నరాలు తెగే ఉత్కంఠ, టెన్షన్ తో మ్యాచ్ సాగుతున్న సమయంలో ఓ అభిమాని వన్‌మ్యాన్ ఆర్మీలా మా అందరిని ఎంటర్‌టైన్ చేశాడు. అతడికి ఈ ఫన్నీ డేని అంకితమిస్తున్నాను. నువ్వు డ్యాన్స్ కొనసాగిస్తుండు'' అని పొగుడుతూ ప్రీతి ట్వీట్ చేశారు.
ప్రీతి పోస్ట్ చేసిన వీడియో అభిమానులకు కూడా అమితంగా నచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ అభిమాని ఎవరా అంటూ ఆరా తీసే వరకు వెళ్లింది. అతడు సరదాకోసం చేసినా ఇప్పుడతడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నాడు.