
పాకిస్తాన్ - ఇంగ్లాండ్ నడుమ ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 275 పరుగులకు ఆలౌట్ అవడంతో పాకిస్తాన్ ఎదుట 355 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్.. మూడో రోజు ఆట ముగిసేసమయానికి 4 కీలక వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి రెండు రోజులు మిగిలి ఉన్న ఆటలో 157 పరుగులు కావాలి. ఇంగ్లాండ్ కు 6 వికెట్లు కావాలి. మరి ముల్తాన్ కా సుల్తాన్ అయ్యేదెవరు..?
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 281 పరుగులకు ఆలౌట్ కాగా పాకిస్తాన్ 202 పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన ఇంగ్లాండ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విఫలమైంది. ఆ జట్టు తరఫున హ్యారీ బ్రూక్ (108) సెంచరీతో రాణించగా బెన్ డకెట్ (79), బెన్ స్టోక్స్ (41) లు మెరిశారు. తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రర్ అహ్మద్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నాలుగు వికెట్లు తీశాడు.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 355 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ధీటుగానే బదులిచ్చింది. రెగ్యులర్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కు తోడుగా ఇమామ్ ఉల్ హక్ ను కాకుండా మహ్మద్ రిజ్వాన్ ను పంపింది పాకిస్తాన్. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 66 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు. 30 పరుగులు చేసిన రిజ్వాన్ ను జేమ్స్ అండర్సన్ బౌల్డ్ చేయగా బాబర్ ఆజమ్ (1) ను రాబిన్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరికొద్దిసేపటికి అబ్దుల్లా (45) ను మార్క్ వుడ్ బౌల్డ్ చేశాడు. 83 పరుగులకే పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.
కానీ సౌద్ షకీల్ తో కలిసి ఇమామ్ ఉల్ హక్ పాక్ ను ఆదుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 108 పరుగులు జోడించారు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇమామ్.. 104 బంతుల్లో 60 పరుగులు చేశాడు. షకీల్ (123 బంతుల్లో 54 బ్యాటింగ్) తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. వికెట్ల కోసం బెన్ స్టోక్స్.. ఆరుగురితో బౌలింగ్ వేయించినా ఏకాగ్రత కోల్పోలేదు.
అయితే ఇక ఆట ముగుస్తుందనగా జాక్ లీచ్ వేసిన 60వ ఓవర్ మూడో బంతికి ఇమామ్.. జో రూట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సౌద్ షకీల్ తో కలిసి నైట్ వాచ్ మెన్ ఫహీమ్ అష్రఫ్ (3) క్రీజులో ఉన్నాడు. 64 ఓవర్లలో పాకిస్తాన్.. 4 వికెట్లకు 198 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే పాకిస్తాన్ కు 157 పరుగులు అవసరమున్నాయి. ఇంగ్లాండ్ కు ఆరు వికెట్లు కావాలి. ఉదయం పూట బంతి స్పిన్ కు అనుకూలిస్తున్న తరుణంలో రేపటి మార్నింగ్ సెషన్ ఆట చాలా కీలకం కానున్నది.