రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ అజర్ ఆలీ... ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టుతో క్రికెట్‌కి గుడ్‌బై...

By Chinthakindhi RamuFirst Published Dec 16, 2022, 1:10 PM IST
Highlights

రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ అజర్ ఆలీ... కరాచీలో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టే ఆఖరిదంటూ ప్రకటన... 96 టెస్టులు ఆడి 7 వేలకు పైగా పరుగులు చేసిన అజర్ ఆలీ.. 

పాకిస్తాన్ క్రికెటర్ అజర్ ఆలీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అజర్ ఆలీ, ఇప్పటిదాకా 95 టెస్టులు ఆడాడు. 2018లో వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అజర్ ఆలీ, 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కరాచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టు, అజర్ ఆలీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది...

‘నా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రిటైర్మెంట్ తీసుకోవడం చాలా ఎమోషనల్ మూమెంట్. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని అనిపించింది. 

నా ఈ ప్రయాణంలో అండగా నిలిచి, నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. నా క్రికెట్ కెరీర్ కోసం నా ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసింది. వాళ్లు లేకుంటే నేను ఈనాడు ఈ పొజిషన్‌లో ఉండేవాడిని కాదు. నా కుటుంబమే నా బలం. అందరు క్రికెటర్లకు టీమ్‌ని నడిపించే అవకాశం దొరకదు. నాకు కెప్టెన్సీ చేసే అవకాశం రావడం చాలా గొప్ప గౌరవం.. లెగ్ స్పిన్నర్‌గా మొదలైన నా ప్రయాణం, టాపార్డర్ బ్యాటర్‌గా మారింది. నా క్రికెట్ కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ని ఎంతో ఎంజాయ్ చేశా...’ అంటూ కామెంట్ చేశాడు అజర్ ఆలీ...

2016లో వెస్టిండీస్‌పై పింక్ బాల్ టెస్టులో 302 పరుగులు చేసిన అజర్ ఆలీ, డే- నైట్ టెస్టులో మొట్టమొదటి సెంచరీ, డబుల్ సెంచరీ, త్రిబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. డే నైట్ టెస్టులో అత్యధిక స్కోరు బాదిన బ్యాటర్‌గా అజర్ ఆలీ రికార్డును 2019లో డేవిడ్ వార్నర్ (335 పరుగులు) బ్రేక్ చేశాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి అవుటైన అజర్ ఆలీ, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ తరుపున 53 వన్డేలు ఆడిన అజర్ ఆలీ, 36.90 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

పాక్ తరుపున 95 టెస్టులు ఆడిన అజర్ ఆలీ, 42.60 సగటుతో 7030 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో వన్డేల్లో, టెస్టుల్లో కలిపి 12 వికెట్లు పడగొట్టాడు..

మిస్బా వుల్ హక్ రిటైర్మెంట్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అజర్ ఆలీ, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అజర్ ఆలీ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు, బంగ్లాదేశ్ చేతుల్లో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది. 

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ప్రత్యర్థి ఓపెనర్‌గా నిలిచిన అజర్ ఆలీ, యూఏఈలో త్రిబుల్ సెంచరీ బాదిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు. 

click me!