ఐపీఎల్ కంటే ఆ లీగే బెటర్ అంటున్న బాబర్ ఆజమ్.. రెండింట్లో ఆడకున్నా ఎందుకంత ఫోజు..?

By Srinivas MFirst Published Mar 16, 2023, 4:54 PM IST
Highlights

Babar Azam: పాకిస్తాన్  క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ ప్రస్తుతం  పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పెషావర్ జల్మీ తరఫున ఆడుతున్నాడు.  తాజాగా బాబర్ ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

గడిచిన పదిహేనేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్   త్వరలోనే 16వ  సీజన్ లోకి అడుగుపెట్టనుంది.  ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ లీగ్ లో ఆడాలని  ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది క్రికెటర్లు ఆశపడుతుంటారు.  అయితే ఐపీఎల్ మాదిరిగానే  వివిధ దేశాల్లో చాలా క్రికెట్ లీగ్ లు ఉన్నా ఈ లీగ్ కు  పోటీనిచ్చేది మాత్రం  దరిదాపుల్లో కూడా లేదు.   కానీ పాకిస్తాన్ క్రికెట్  జట్టు  సారథి మాత్రం ఐపీఎల్ పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

పెషావర్ జల్మీ  తరఫున  నిర్వహిస్తున్న పోడ్కాస్ట్ లో బాబర్ మాట్లాడుతూ.. తనకు ఐపీఎల్  కంటే  ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అంటేనే ఎక్కువ ఇష్టమని  చెప్పాడు.   వాస్తవానికి  ఈ రెండు లీగ్ లలోనూ బాబర్ ఆడలేదు.  

పెషావర్ జల్మీ  పోడ్కాస్ట్ నిర్వహించే యాంకర్  ‘బీబీఎల్  లేదా ఐపీఎల్.. ఇందులో మీకు ఏది చూడటం ఇష్టం..’అని అడిగాడు. దానికి  బాబర్ మాట్లాడుతూ.. (కాసేపు ఆలోచించాక) ‘బీబీఎల్’ అని బదులిచ్చాడు.  అయితే ఎందుకు..? అని యాంకర్ అడగ్గా బాబర్ స్పందిస్తూ... ‘ఆస్ట్రేలియాలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడి పిచ్ లు కూడా భిన్నంగా ఉంటాయి.  బంతి బ్యాట్ మీదకు దూసుకువస్తుంది.   అక్కడ చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.  కానీ ఐపీఎల్ లో  ఏముంది..? మనకు ఇక్కడ (పాకిస్తాన్) ఉన్నట్టే ఆసియా కండిషన్సే ఉంటాయి...’ అని చెప్పాడు. 

 

According to Babar Azam 👑

Big Bash League > IPL pic.twitter.com/RRpbH57wuE

— Cricket Pakistan (@cricketpakcompk)

కాగా ఐపీఎల్.. 2008లో ప్రారంభమవగా బాబర్ కు నచ్చే బీబీఎల్ 2011లో ఆరంభమైంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ 2015లో మొదలైంది.  తనకు బీబీఎల్ అంటే ఇష్టమని చెప్పిన బాబర్.. అటు ఆ లీగ్ లో  ఇంతవరకూ ఆడలేదు. పలుమార్లు బీబీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపినా పాకిస్తాన్ బోర్డు అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వలేదు.  ఇక 2008 తొలి ఎడిషన్ లో మాత్రమే పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడటానికి అవకాశమిచ్చిన భారత ప్రభుత్వం.. ఆ తర్వాత సరిహద్దు, రాజకీయ వివాదాలతో వారిని ఈ లీగ్ లోకి అనుమతించడం లేదు. 

బాబర్ కామెంట్స్ పై ఐపీఎల్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. స్వయంగా ఆస్ట్రేలియా క్రికెటర్లే తమ జాతీయ జట్టు షెడ్యూల్ లను వదిలేసి ఐపీఎల్ ఆడేందుకు రావడమే గాక ఈ లీగ్ లో ఆడేందుకు ఆసక్తి చూపుతుంటే  బాబర్ మాత్రం ఐపీఎల్ పై ఇలా  మాట్లాడటం తగదని వాపోతున్నారు. ఇక పీఎస్ఎల్ లో బాబర్ సారథిగా ఉన్న పెషావర్ జల్మీ..  ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయింది.  లీగ్ దశలో పది మ్యాచ్ లు ఆడిన బాబర్ సేన.. ఐదు మ్యాచ్ లలో గెలిచి  ఐదింట్లో ఓడింది.   పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పెషావర్.. నేడు (మార్చి 16)  ఇస్లామాబాద్ యునైటైడ్ తో  ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు  ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఓడిన జట్టు బ్యాగ్ సర్దుకోవడమే.. 

 

click me!