Pakistan: పొట్టి ఫార్మాట్ లో ఎదురేలేని పాకిస్థాన్.. అరుదైన రికార్డు సాధించిన బాబర్ ఆజమ్ సేన

Published : Dec 14, 2021, 02:43 PM IST
Pakistan: పొట్టి ఫార్మాట్ లో ఎదురేలేని పాకిస్థాన్.. అరుదైన రికార్డు సాధించిన బాబర్ ఆజమ్ సేన

సారాంశం

18 T20I wins For Pakistan: టీ20 క్రికెట్ లో పాక్ అప్రతీహాత జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ ఏడాది మొత్తంగా 27  టీ20 లు ఆడిన పాకిస్థాన్.. ఆరు మ్యాచుల్లో మాత్రమే ఓడింది. మూడు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి.

పొట్టి క్రికెట్ లో పాకిస్థాన్ అదరగొడుతున్నది. టీ20 క్రికెట్ లో ఆ జట్టు అప్రతీహాత విజయాలతో ఎదురేలేకుండా సాగుతున్నది. ఈ ఏడాదిలో అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్టుగా పాకిస్థాన్ అరుదైన రికార్డు సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ సారథ్యం.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ విన్యాసాలతో పాటు యువ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, హసన్ అలీ లు ఆ జట్టు విజయాల్లో వెన్నెముకగా నిలుస్తున్నారు. కాగా, వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా.. సోమవారం జరిగిన తొలి టీ20 లో విజయం సాధించడంతో ఆ జట్టు.. గతంలో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టింది. 

ఒక క్యాలెండర్ ఇయర్ లో 18 విజయాలు సాధించిన పాకిస్థాన్.. ఈ రేర్ ఫీట్ సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. అంతకుముందు కూడా ఈ రికార్డు పాకిస్థాన్ పేరిటే ఉంది. ఒక ఏడాదిలో 17 విజయాలు సాధించిన పాక్.. తాజాగా దానిని బ్రేక్ చేసింది. 

ఈ ఏడాది మొత్తంగా 27  టీ20 లు ఆడిన పాకిస్థాన్.. ఆరు మ్యాచుల్లో మాత్రమే ఓడింది. మూడు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక మిగతా 18 మ్యాచులలో గెలుపు పాక్ నే వరించింది.   ఈ ఫార్మాట్ లో వంద విజయాలు సాధించిన జట్టుగా కూడా  పాక్ కు రికార్డు ఉంది. ఇక తాజాగా విండీస్ తో సాధించిన  విజయంతో ఆ జట్టు గత పదకొండు మ్యాచులలో  పదింటిలో  నెగ్గింది.  ఓడిన ఒక్క మ్యాచ్ ఏంటంటే.. టీ20 ప్రపంచకప్ లో భాగంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఓడింది. 

 

విజయాలివే..

ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచుల సిరీస్ తో వేట ప్రారంభించిన పాకిస్థాన్.. దానిని 2-1 తో గెలుచుకుంది. ఆ తర్వాత అదే జట్టుపై 3-1 తో విజయం సాధించింది. ఆ వెంటనే జింబాబ్వేపై 2-1, వెస్టిండీస్ పై 1-0తో సిరీస్ లు చేజిక్కించుకుంది. ఈ ఏడాది విదేశాల్లో పాక్ ఓడింది ఒక్క ఇంగ్లాండ్ పైనే. ఆ దేశంతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో పాక్ 1-2 తో ఓడింది. ఇక ఇటీవలే టీ20 సిరీస్ లో లీగ్ దశలో వరుసగా ఐదు మ్యాచులు నెగ్గిన పాక్.. సెమీస్ లో ఆసీస్ చేతిలో ఓడింది.  

అంతా వాళ్లిద్దరి చేతుల్లోనే.. 

పాక్ జట్టు ప్రధాన బలం ఆ టీమ్ సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ల మీదే ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఈ ఏడాది టీ20లలో రికార్డు భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ ఏడాది ఈ జోడీ ఏకంగా 1,208 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిందంటే వీళ్ల ఫామ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్యాలెండర్ ఇయర్ లో ఆజమ్.. 853  పరుగులు చేస్తే, రిజ్వాన్ 1,201 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరూ కలిసి వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. 

క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాల జాబితా (టాప్-5) : 

18 విజయాలు - పాకిస్థాన్ - 2021
17 విజయాలు - పాకిస్థాన్ - 2018 
15 విజయాలు - ఇండియా - 2016
15 విజయాలు - సౌతాఫ్రికా - 2021 
14 విజయాలు - ఇండియా - 2018 

ఇక సోమవారం కరాచీ వేదికగా  వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రిజ్వాన్ 52 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో విండీస్.. 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 63 పరుగుల తేడాతో పాక్ ను విజయం వరించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !