కివీస్ బ్యాటర్లను కట్టిపడేసిన పాకిస్తాన్... ఫైనల్ చేరేందుకు పాక్ ముందు ఊరించే టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Nov 9, 2022, 3:18 PM IST
Highlights

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్ 1: 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన న్యూజిలాండ్... డార్ల్ మిచెల్ అజేయ హాఫ్ సెంచరీ... 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. లక్కీగా సెమీస్ చేరిన పాకిస్తాన్, గ్రూప్ 1 టేబుల్ టాపర్ న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది...

ఇన్నింగ్స్ మొదటి బంతికి ఫోర్ బాదిన ఫిన్ ఆలెన్, ఆ తర్వాత మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రెండో బంతికి ఫిన్ ఆలెన్‌ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు అంపైర్. రివ్యూ తీసుకున్న కివీస్ ఓపెనర్, టీవీ రిప్లైలో బంతి బ్యాటును తాకుతున్నట్టు కనిపించడంతో బతికిపోయాడు. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోని ఫిన్ ఆలెన్, తర్వాతి బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

20 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన డివాన్ కాన్వే, రనౌట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 49 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. ఈ దశలో కేన్ విలియంసన్,డార్ల్ మిచెల్ కలిసి నాలుగో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

ఈ ఇద్దరూ వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి 59 పరుగులే చేసింది న్యూజిలాండ్. . 

42 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పాక్ బౌలర్లు, న్యూజిలాండ్‌కి భారీ స్కోరు ఇవ్వకుండా అడ్డుకోగలిగారు...

డార్ల్ మిచెల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో డార్ల్ మిచెల్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ. ఇంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై 72 పరుగులు చేసి న్యూజిలాండ్‌ని ఫైనల్ చేర్చాడు డార్ల్ మిచెల్...

ఇంతకుముందు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ మాత్రమే టీ20 వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్స్‌లో రెండు సార్లు 50+ స్కోర్లు చేశారు. డార్ల్ మిచెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేయగా జేమ్స్ నీశమ్ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి 5 ఓవర్లలో 46 పరుగులే రాబట్టగలిగింది న్యూజిలాండ్.. 


 

click me!