కివీస్ పాకిస్తాన్ టూర్ రద్దు చేసుకోవడం భారత్ కుట్రే: పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు

By telugu teamFirst Published Sep 23, 2021, 7:20 PM IST
Highlights

పాకిస్తాన్‌లో ఏ తీవ్ర సవాల్ ఎదురైనా, పరిణామం చోటుచేసుకున్నా భారత్‌పై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుంటే అది భారత్ కుట్రేనని అడ్డదిడ్డంగా వాదిస్తున్నది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారత్ నుంచే బెదిరింపులు వెళ్లాయని నిరాధార ఆరోపణలు చేసింది.

పాకిస్తాన్‌(Pakistan)కు భారత్‌(India)పై నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. న్యూజిలాండ్(Newzealand) క్రికెట్(Cricket) జట్టు పాకిస్తాన్ టూర్‌(Tour)ను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడానికీ భారతే కారణమని అర్థరహిత వ్యాఖ్యలు చేసింది. కివీస్ జట్టుకు బెదిరింపులు(Threat) చేయడంలో భారత్ హస్తముందని తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి ఈ సంచలన ఆరోపణలు చేశాడు.

కివీస్ టూర్ రద్దుకు భారత్ కుట్ర చేసిందని ఫవాద్ చౌదరి ఆరోపించారు. న్యూజిలాండ్ జట్టుకు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని, అది సింగపూర్ లొకేషన్ చూపించే వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ద్వారా ఇండియా నుంచే పంపబడిందని ఆరోపణలు చేశారు. బెదిరింపు మెయిల్ వచ్చిన మొబైల్ ఫోన్ 2019 ఆగస్టులో ఇండియాలోనే ఉన్నదని, సెప్టెంబర్ 25న యాక్టివ్ అయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయి నుంచి ఈ ఈమెయిల్ వచ్చినట్టు ఆరోపణలు చేశారు.

పరిమిత ఓవర్‌ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. తొలి వన్డే ఈ నెల 17న ఆడాల్సింది. కానీ, దానికి కొద్ది నిమిషాల ముందే భద్రతా కారణాలరీత్యా మ్యాచ్‌ను ఆడబోవడం లేదని ప్రకటించింది. మొత్తం టూర్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.

ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటించాల్సి ఉన్నది. కానీ, న్యూజిలాండ్ జట్టు టూర్‌ను రద్దు చేసిన తర్వాత ఇంగ్లాండ్ కూడా పాకిస్తాన్‌ వెళ్లడం లేదని తెలిపింది.

ఈ ప్రకటనలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి. భవిష్యత్‌లో అక్కడ విదేశీ జట్ల పర్యటనలు దాదాపు ప్రశ్నార్ధకంగా మారాయి. ఫలితంగా రెవెన్యూ పడిపోవడం, సొంత జట్టుకూ కష్టాలు వచ్చే ముప్పు ఉన్నది.

click me!