బాబర్ ఆజమ్ అద్భుత సెంచరీ... కోహ్లీ, మియాందాద్ ల రికార్డులు బద్దలు

By Arun Kumar PFirst Published Oct 1, 2019, 4:02 PM IST
Highlights

స్వదేశంలో చాలాకాలం తర్వాత జరుగుతున్న వన్డే సీరిస్ లో పాక్ ఓపెనర్ బాబర్ ఆజమ్ అద్భుతంగా రాణించాడు. అద్భుత సెంచరీతో చెలరేగిన అతడు 32ఏళ్ల అరుదైన రికార్డును బద్దలుగొట్టాడు.  

చాలాకాలం తర్వాత సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టుకు మంచి శుభారంభం లభించింది. కరాచీ వేదికన శ్రీలంక తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ బాబర్ ఆజమ్ చెలరేగిపోయాడు. ఆరంభంనుండే బ్యాట్ ను ఝలిపించిన అతడు అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే అతడి ఖాతాలోకి మరికొన్ని అద్భుత రికార్డులు చేరాయి. టీమిండియా రన్ మెషీన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్ లను వెనక్కినెట్టిన బాబర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 

పాకిస్థాన్ జట్టు మొత్తంలో నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు బాబర్. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే అతడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇదే ఊపును కరాచీ వన్డేలోనూ కొనసాగించి కేవలం 105 బంతుల్లోనే 115 పరుగులు(8 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఈ శతకం అతడి వన్డే కెరీర్ లో 11వది. అతడు కేవలం 71 ఇన్నింగ్సుల్లోనే ఇలా 11 సెంచరీలను పూర్తి చేసుకుని ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. 

వన్డే క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 11 శతకాల బాదిన ఆటగాళ్ల జాబితాలో హషీమ్ ఆమ్లా(64), క్వింటన్ డికాక్(65) మొదటిరెండు స్థానాల్లో వున్నారు. వారి తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ(82) ఇన్నాళ్లు కొనసాగాడు. కానీ తాజా సెంచరీ ద్వారా బాబర్ అతన్ని వెనక్కినెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. దీంతో కోహ్లీ నాలుగో స్థానానికి పడిపోయాడు. 

ఇదే కరాచీ వన్డేలో బాబర్ మరో రికార్డును కూడా బద్దలుగొట్టాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో వేగంగా వెయ్యి పరుగులను పూర్తిచేసుకున్న పాక్ ఆటగాడిగా బాబర్ నిలిచాడు. పాక్  మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ 1987 లో కేవలం 21 ఇన్నింగ్సుల్లోనే వెయ్యి పరుగులను పూర్తిచేశాడు. అప్పటినుండి ఈ రికార్డు అతడిపేరిటే వుంది. కానీ ఈ క్యాలెండర్ ఇయర్ ఇప్పటివరకు కేవలం 19 ఇన్నింగ్సులే ఆడిన బాబర్ వెయ్యి పరుగులను పూర్తిచేసుకున్నాడు. దీంతో 32 ఏళ్ల మియాందాద్ రికార్డు కాస్తా బాబర్ పేరుపైకి మారింది. 

పాకిస్థాన్ లో జరుగుతున్న మూడు వన్డే సీరిస్ లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక సోమవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు చెలరేగి శ్రీలంకను చిత్తుచేసింది. మొదట బాబర్ ఆజమ్ 115, ఫకార్ జమాన్ 54, హరిస్ సోహైల్ 40 పరుగులతో రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 305 పరుగులు చేసింది. 306 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక కేవలం 238 పరుగులకే ఆలౌటయ్యింది. జయసూర్య 96, షనక 68 పరుగులతో రాణించినా ఫలితంలేకుండా పోయింది. ఇలా 3 వన్డేల సీరిస్ లో పాక్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. దీంతో చివరి వన్డే నిర్ణయాత్మకంగా మారింది. 

click me!