బౌండరీల ద్వారా ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచి యేడాది!

By Sreeharsha GopaganiFirst Published Jul 15, 2020, 8:32 AM IST
Highlights

చారిత్రాక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్‌పై నెగ్గి జగజ్జేతగా నిలిచింది.

నరాలు తెగే ఉత్కంఠ. నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డ ఇరు జట్లు. దూకుడుగా ఆడిన బ్యాట్స్‌మెన్‌. వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్‌ టై.... ఓ సూపర్‌  ఓవర్‌......  అది చాలదన్నట్టుగా....  బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. 

క్రికెట్‌లో ఏదో ఒకటి జరగడం కామన్‌. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్‌లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ అవుతుంది.వన్డేల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్‌కు నేటితో(జులై 14) సరిగ్గా ఏడాది నిండింది. 

ఈ చారిత్రాక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్‌పై నెగ్గి జగజ్జేతగా నిలిచింది. ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ స్టోక్స్‌ పోరాటంతో ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్‌ వద్ద స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను ట్రెంట్‌ బౌల్ట్‌ జారవిడిచాడు.

అదృష్ట, దురదృష్టాల పరాకాష్ట.... 

ఆఖరి ఓవర్‌లో బంతిని అందుకున్న బౌల్ట్‌ తొలి రెండు డెలివరీలను డాట్స్‌గా మలిచాడు. స్టైక్‌లో ఉన్న స్టోక్స్‌ మూడో బంతిని సిక్సర్‌గా బాది ఇంగ్లాండ్‌ శిబిరంలో ఆనందం నింపాడు. 

ఆ తర్వాతి బంతిని ఆడిన స్టోక్స్‌ పరుగు కోసం డైవ్‌ చేశాడు. ఫీల్డర్‌ గప్టిల్‌ శరవేగంగా బంతిని త్రో చేశాడు. అది స్టోక్స్‌ బ్యాట్‌ను బలంగా తాకి బౌండరీ దాటింది. దీంతో న్యూజిలాండ్‌ జట్టు నివ్వెరపోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ వుడ్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో మ్యాచ్‌ టై అయింది. 

సూపర్ ఓవర్..... 

సూపర్‌ ఓవర్‌లో స్టోక్స్,‌ జోస్‌ బట్లర్‌ కలిసి న్యూజిలాండ్‌కు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ జేమ్స్‌ నీషమ్‌ ఓ సిక్సర్‌ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే న్యూజిలాండ్‌ విశ్వవిజేతగా నిలుస్తుంది. రెండు పరుగుల కోసం ఊపిరి బిగబట్టి చేసిన ప్రయత్నంలో గప్టిల్‌ రనౌట్‌ అయ్యాడు. 

దాంతో న్యూజిలాంట్‌ టీమ్‌ నిరాశలో కూరుకుపోయింది.ఇంగ్లండ్‌ క్రీడాకారుల విజయదరహాసంతో లార్డ్స్‌ క్రికెట్‌ స్టేడియం ఉర్రూతలూగింది. ఈ మ్యాచ్‌ లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌(26), న్యూజిలాండ్‌(17)పై గెలుపొందింది. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌కు ఇదే తొలి కప్‌ కావటం గమనార్హం.

click me!