Umran Malik: పేస్ ఒక్కటే సరిపోదు.. ఇంకొన్నాళ్లాగితేనే బెటర్.. ఉమ్రాన్ కు షమీ, మెక్ గ్రాత్ కీలక సూచన

By Srinivas MFirst Published May 14, 2022, 6:58 PM IST
Highlights

IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో  అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. భారత్ లో మునుపెన్నడూ ఏ బౌలర్ కూడా అతనంత వేగంగా బౌలింగ్ చేయలేదు.   వేగం ఒక్కటే నమ్ముకున్న అతడు లైన్ అండ్ లెంగ్త్ ను మిస్ అవుతున్నాడు. 

ఐపీఎల్ లో సంచలన ప్రదర్శనలతో  అందరి దృష్టిని ఆకర్షించిన  సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలతో పాటు  అతడి కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని కీలక సూచనలు కూడా బాగానే వస్తున్నాయి.  ఆస్ట్రేలియా జట్టు దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ తో పాటు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ లు కూడా అతడికి కీలక సూచన చేశారు. ఒక్క పేస్ నే నమ్ముకుంటే పనవ్వదని.. లైన్ అండ్ లెంగ్త్ తో కూడిన  నియంత్రణ గల బంతులు విసిరితే ఉమ్రాన్ ను ఆపడం ఎవరితరమూ కాదని అతడికి సూచించారు. ఐపీఎల్-15లో భాగంగా కోల్కతాతో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతున్న తరుణంలో ఉమ్రాన్ కు ఈ ఇద్దరూ విలువైన సలహాలిచ్చారు. 

ఉమ్రాన్ మాలిక్ గురించి మెక్ గ్రాత్ మాట్లాడుతూ... ‘ఒక బౌలర్ కు  వేగం ముఖ్యమే. కానీ ఉమ్రాన్ మాలిక్ వేగంతో పాటు బంతిని తన నియంత్రణలో ఉంచుకునే  విధానాన్ని కూడా అలవరచుకోవాలి. వేగంతో పాటు బంతి పై నియంత్రణ కూడా దొరికినట్టేతే  అతడిని ప్రపంచంలో ఏ జట్టైనా దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతుంది.. 

ఐపీఎల్ లో అతడికి ఇది రెండో సీజన్ మాత్రమే.  రెండు, మూడు సీజన్లలో రాణించడం సహజమే. కానీ ఒకసారి  బ్యాటర్లకు నీ బౌలింగ్ గురించి అర్థమయ్యాక అప్పుడు  ఎలా బౌలింగ్ వేసావన్నది ముఖ్యం. అదీగాక ఒక బౌలర్ నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా బౌలింగ్ చేయడమనేది అతడిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. అప్పుడు నిన్ను నువ్వు  బలంగా, మానసికంగా దృఢంగా ఉంచుకోవాలి. ఒకవేళ నువ్వు లయ తప్పితే మాత్రం  వాళ్లు (ప్రాంచైజీలు) నిన్ను తీసుకోరు..’ అని తెలిపాడు. 

 

The only ball that beat this one in sheer pace was bowled 11 years ago. Let that sink in. 🔥 | pic.twitter.com/JO0fCjNErU

— SunRisers Hyderabad (@SunRisers)

ఇక ఇదే విషయమై మహ్మద్ షమీ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ కు మంచి వేగం ఉంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే..  దానివల్ల  పెద్దగా ఉపయోగం లేదు. నేను పేస్ బౌలింగ్ కు పెద్ద అభిమానినేమీ కాదు.  గంటకు 140 కి.మీ. వేగంతో బంతులు వేసినా బంతిపై మీ నియంత్రణ ఉండాలి. దానిని  ఏ వైపుకైనా ఎలాగైనా తిప్పగలిగే సామర్థ్యముండాలి.  అది చాలు బ్యాటర్లను బురిడీ కొట్టించడానికి. ఉమ్రాన్ దగ్గర వేగముంది గానీ అతడు ఇంకా పరిణితి సాధించడానికి కొద్ది సమయం అవసరం. బౌలర్లు పేస్ తో పాటు కచ్చితత్వం మీద కూడా దృష్టి సారించాలి..’ అని షమీ అన్నాడు. 

కాగా.. సీజన్ ఆరంభంలో  తన  పేస్ తో పాటు యార్కర్లతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ఇబ్బందికి గురి చేసిన ఉమ్రాన్ మాలిక్ తర్వాత లయ కోల్పోయాడు. గుజరాత్ టైటాన్స్  తో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన తర్వాత నాలుగు మ్యాచులు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.  వికెట్ తీయకపోగా ధారాళంగా పరుగులిస్తుండటం ఆందోళనకరంగా మారింది.  

click me!