మళ్లీ పాకిస్తాన్‌ పర్యటనకు రానున్న కివీస్.. ఈసారైనా ఆడతారా..?

By Srinivas MFirst Published Oct 10, 2022, 2:09 PM IST
Highlights

New Zealand To Tour Pakistan: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రాబోయే ఎనిమిది నెలల కాలంలో రెండుసార్లు పాకిస్తాన్ పర్యటనకు రానున్నది. మూడు ఫార్మాట్లకు సంబంధించిన మ్యాచ్ షెడ్యూల్స్ ను ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది.

పాకిస్తాన్ క్రికెట్ కు మంచిరోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి.  2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సు మీద ఉగ్రవాదులు దాడులకు దిగిన తర్వాత కొన్నాళ్లు నిషేధం ఎదుర్కున్న పాకిస్తాన్.. తర్వాత  చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్నది. వెస్టిండీస్, జింబాబ్వే వంటి జట్లు అడపాదడపా పాకిస్తాన్ కు వచ్చినా పేరు మోసిన జట్లు మాత్రం పాక్ సరిహద్దుల వంక చూడలేదు. కానీ కొన్నాళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ అయ్యాక  పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ కు మళ్లీ పూర్వపు కళ వచ్చింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి అగ్రజట్లు  పాక్ కు పర్యటించగా తాజాగా న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్ కు వెళ్లనుంది. 

ఈ ఏడాది డిసెంబర్ లో న్యూజిలాండ్.. రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ కు రానున్నది. డిసెంబర్ 27 నుంచి 31 వరకు కరాచీ వేదికగా తొలి టెస్టు, జనవరి 4 నుంచి 8 వరకు ముల్తాన్ లో రెండో టెస్టు (కివీస్ జట్టు పాకిస్తాన్ లో చివరిసారిగా 1990లో టెస్టు ఆడింది) జరుగుతుంది.  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఈ టెస్టులు జరుగుతాయి. 

రెండు టెస్టులు ముగిసిన తర్వాత కివీస్.. జనవరి 11, 13, 15న పాకిస్తాన్ తో మూడు వన్డేలు ఆడుతుంది. దీంతో తొలి విడత పర్యటన ముగియనున్నది.  ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్ లో కివీస్.. పాక్ పర్యటనకు తిరిగొస్తుంది. ఈసారి కరాచీలో లో నాలుగు టీ20 (ఏప్రిల్ 13, 15,  16, 19న) లు ఆడుతుంది. ఐదో టీ20 లాహోర్ లో ఏప్రిల్ 23న జరుగుతుంది. 

 

🗓️Mark your calendars!

After hosting Australia and England, PCB announces details of New Zealand dual tours of Pakistan pic.twitter.com/CDRmfZxOMT

— Pakistan Cricket (@TheRealPCB)

ఇక ఆ తర్వాత వన్డే సిరీస్ లో మిగిలిపోయిన ఐదు మ్యాచ్ ల షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 26, 28న లాహోర్ లో రెండు వన్డేలు, మే 1, 4, 7 న రావల్పిండిలో  చివరి మూడు మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మేరకు ఇరు జట్లు షెడ్యూల్ ను కూడా ప్రకటించాయి.  

ఇదిలాఉండగా.. గతేడాది అక్టోబర్ లో పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన కివీస్.. రావల్పిండిలో తొలి వన్డే ప్రారంభానికి కొద్దిగంటల ముందు భద్రత సమస్యలను కారణంగా చూపి ఉన్నఫళంగా న్యూజిలాండ్ విమానమెక్కింది. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చొరవ తీసుకుని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు, ప్రధానితో మాట్లాడినా కివీస్ వినలేదు. దీంతో టీ20 ప్రపంచకప్-2021లో  భారత్ తో పాటు  న్యూజిలాండ్ మీద కూడా పగ తీర్చుకోవాలని  పాక్ మాజీలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి అప్పుడు భద్రతా కారణాలను చెప్పిన  న్యూజిలాండ్.. ఇప్పుడైనా ఆడుతుందా..? లేక మరేదైనా సాకు చెప్పి తిరిగి వెళ్లిపోతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. 

click me!