NZ Vs BNG: ముందు బ్యాటుతో చెలరేగి.. ఆ పై బంతితో పడగొట్టి.. బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించిన కివీస్

By Srinivas MFirst Published Jan 10, 2022, 1:15 PM IST
Highlights

New Zealand Vs Bangladesh: రెండో రోజు మూడో సెషన్ కు ముందు 521 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్  చేసిన కివీస్.. 41 ఓవర్లలోనే బంగ్లాను పడగట్టింది. దీంతో 395 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.

తొలి టెస్టులో ఓటమి కుంగదీసిందో లేక చిన్న జట్టుపై పరాజయం పాలైనందుకు  కసి పెరిగిందో తెలియదు గానీ రెండో టెస్టులో న్యూజిలాండ్ అదరగొడుతున్నది. మొదటి టెస్టులో దారుణ పరాజయం తర్వాత తిరిగి పుంజుకుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అసలైన ప్రపంచ ఛాంపియన్లను పరిచయం చేస్తూ.. బంగ్లా పులులను వణికించింది. ముందు బ్యాటింగ్ లో చెలరేగిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లో బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విజయం దిశగా అడుగులు  వేస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసి 521-6 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆ జట్టు.. బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్సులో 126 పరుగులకే ఆలౌట్ చేసింది. 


రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ ను 41.2 ఓవర్లలోనే పెవిలియన్ కు పంపారు కివీస్ బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్ (5-43) కు తోడు సీనియర్ పేసర్ టిమ్ సౌథీ (3-28), జెమీసన్ (2-32)  బౌలింగ్ కు బంగ్లా బ్యాటర్లు దాసోహమయ్యారు.  ముఖ్యంగా బౌల్ట్ అయితే నిప్పులు చెరిగాడు. కివీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ లో యాసిర్ అలీ (55) నురుల్ హసన్ (41) మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. 

 

Another great day for New Zealand cricket 🤩🇳🇿

Watch the replay and highlights on-demand on Spark Sport pic.twitter.com/Yz3gp7gRzk

— Spark Sport (@sparknzsport)

భారీ స్కోరును చూసి బంగ్లా బ్యాటర్లకు ఆదిలోనే బౌల్ట్, సౌథీలు షాకిచ్చారు. ఓపెనర్లు షద్మాన్ ఇస్లాం (7) ను బౌల్ట్ ఔట్ చేయగా.. మహ్మద్ నయీమ్ ను సౌథీ బౌల్డ్ చేశాడు. నజ్ముల్ హుస్సేన్ (4),  కెప్టెన్ మొమినల్ హక్ (0), లిటన్ దాస్ (8) లు త్వరగానే పెవిలియన్ కు చేరారు. దీంతో బంగ్లాదేశ్ 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పయింది. ఈ క్రమంలో  యాసిర్ అలీ, నురుల్ హసన్ లు వికెట్ల పతానాన్ని కాసేపు అడ్డుకున్నారు.  కానీ  28.6 ఓవర్లో  సౌథీ.. హసన్ ను  ఔట్ చేయడంతో  బంగ్లా ఆలౌట్ కావడానికి పెద్దగా టైం పట్టలేదు. 

లాథమ్ డబుల్ సెంచరీ.. 

అంతకుముందు 349-1 పరుగుల ఓవర్ నైట్  స్కోరు వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన కివీస్ తాత్కాలిక సారథి టామ్ లాథమ్ (252) డబుల్ సెంచరీ సాధించాడు. 373 బంతులు ఎదుర్కున్న అతడు.. 34 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగాడు. 99 పరుగులతో  రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన డెవిన్ కాన్వే (109) కూడా సెంచరీ చేసుకున్నాడు. ఆ తర్వాత కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (28), టామ్ బ్లండెల్ (57 నాటౌట్) మెరుగ్గానే ఆడారు.  మూడో సెషన్ కు ముందు 521 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్  చేసిన కివీస్.. 41 ఓవర్లలోనే బంగ్లాను పడగట్టింది. దీంతో 395 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. బంగ్లా ఇప్పుడు ఫాలో ఆన్ ఆడనున్నది. 

click me!