మీరెక్కడ దొరికార్రా మా ప్రాణాలకు.. క్రికెట్‌లో వదలరు.. హాకీలో కూడానా..?

By Srinivas MFirst Published Jan 23, 2023, 12:58 PM IST
Highlights

INDvsNZ: భారత్ - న్యూజిలాండ్ ల మధ్య ఐసీసీ టోర్నీలలో  వాళ్లదే పైచేయి. ఈ  కథ ఈనాటిది కాదు. 1975  నుంచే సాగుతోంది. ఇక  క్రికెట్ చాలదన్నట్టు హాకీలో కూడా టీమిండియ పాలిట  దురుదృష్టదేవతలా మారింది. 

ఒడిశా  వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచకప్ లో భాగంగా   ఆదివారం న్యూజిలాండ్ తో ముగిసిన క్రాస్ ఓవర్ మ్యాచ్ లో  భారత జట్టు  పెనాల్టీ షూటౌట్ లో  ఓడి   వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.  మ్యాచ్ లో తొలుత లీడ్ లో ఉన్నప్పటికీ  చివరికి  పట్టు కోల్పోయిన టీమిండియా.. పెనాల్టీ షూటౌట్ లో పోరాడినప్పటికీ   ఒక్క పాయింట్ తేడాతో   ఓడింది.  ఈ ఓటమితో  48 ఏండ్ల తర్వాత  ప్రపంచకప్ నెగ్గాలన్న భారత్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది. అయితే  భారత్ కు షాకివ్వడం న్యూజిలాండ్ కు ఇదేం కొత్త కాదు.  కీలక టోర్నీలలో న్యూజిలాండ్ టీమిండియా పాలిట శత్రువు.   

భారత క్రికెట్ అభిమానులకు దీని గురించి బాగా తెలుసు. ఒక్కటా రెండా.. చాలా ఏండ్లుగా  కివీస్.. భారత్ కు షాకుల మీద షాకులిస్తూనే ఉంది.  ఐసీసీ టోర్నీలలో భారత్ ప్రయాణానికి బ్రేకులు వేసే  న్యూజిలాండ్.. ఇప్పుడు హాకీలో కూడా ‘వదల బొమ్మాళి వదలా..’ అంటూ మన వెంట పడింది.  

క్రికెట్ లో..

భారత్ - న్యూజిలాండ్ ల మధ్య ఐసీసీ టోర్నీలలో  వాళ్లదే పైచేయి.  ఈ  కథ ఈనాటిది కాదు. 1975 లో న్యూజిలాండ్.. భారత్ ను మాంచెస్టర్ లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.  1979 లో లీడ్స్ లో 8 వికెట్ల తేడాతో  గెలిచింది.   1992లో   నాటింగ్‌హోమ్  వేదికగా జరిగిన వన్డేలో 5 వికెట్ల తేడాతో  నెగ్గింది.  1987, 2003లలో మాత్రం భారత్ దే విజయం. 

గుండె పగిలిన క్షణం.. 

అది 2019 వన్డే ప్రపంచకప్   సెమీఫైనల్. భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.   ఈ మ్యాచ్ లో  భారత్ విజయానికి సమీపంగా వచ్చినా అదృష్టం కివీస్ వైపు నిలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 239 పరుగులే చేసింది.  కానీ భారత్ బ్యాటింగ్ లో తడబడింది.  రోహిత్, రాహుల్, విరాట్  విఫలమయ్యారు. ధోని (50), జడేజా (77) ఆదుకున్నా.. ధోని రనౌట్ తో మ్యాచ్ గతి మారిపోయింది. భారత్ 221 పరుగుల వద్దే ఆగిపోయింది. మాంచెస్టర్ లో  జరిగిన ఆ మ్యాచ్ లో  భారత్.. 18 పరుగుల తేడాతో ఓడింది.   ధోని ఆడిన చివరి వన్డే ఇదే.  ఇక 2021లో ఇదే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన  ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా   అదే ఫలితం  రిపీట్ అయింది.  తొలి  డబ్ల్యూటీసీ టైటిల్ నెగ్గాలన్న భారత్ కు కివీస్ మరోసారి కోలుకోలేని షాకిచ్చింది. 

ఇన్నాళ్లు క్రికెట్ లోనే షాకులిచ్చిన న్యూజిలాండ్..  తాజాగా హాకీలో కూడా  మన పాలిట  కొరకరాని కొయ్యగా మారింది.  మ్యాచ్ మూడో క్వార్టర్స్ వరకు  భారత్ దే ఆధిపత్యం అయినప్పటికీ చివర్లో పుంజుకుని  స్కోర్లను సమం చేసింది. అంతేగాక  పెనాల్టీ షూటౌట్ లో 5-4 తేడాతో మన ఆశలను మరోసారి అడియాసలు చేసింది. 

 

New Zealand exists just to give us heartbreaks may it be cricket or hockey.

— R A T N I S H (@LoyalSachinFan)

 

Yet another heart break for India and fans. India lost against New Zealand and they are out of this Hockey World Cup. India played really well throughout the World Cup and now they lost in knockout match.

— CricketMAN2 (@ImTanujSingh)

ఈ ఓటమి తర్వాత  భారత అభిమానులు ట్విటర్ వేదికగా  ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు. అసలు న్యూజిలాండ్ టీమ్ ఉన్నదే  కీలక టోర్నీలలో  భారత్ కు షాకులిచ్చేందుకు కాబోలు..? అని వాపోతున్నారు. ‘భారీ టోర్నీలలో భారత్ కు షాకులివ్వడం  మీకు అంత సరదానా..?’ అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.  

click me!