టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టుని ప్రకటించిన న్యూజిలాండ్... కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న...

By Chinthakindhi RamuFirst Published Sep 20, 2022, 10:36 AM IST
Highlights

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్... ఫామ్‌లో లేని కేన్ విలియంసన్! గాయాలతో స్టార్ బౌలర్లు దూరం..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి న్యూజిలాండ్ కూడా జట్టును ప్రకటించేసింది. గత కొంత కాలంలో ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తోంది న్యూజిలాండ్. 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్, 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ చేరింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్... మూడు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచింది...

2019 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో సూపర్ ఓవర్ డ్రామాలో లక్ మిస్ కావడంతో టైటిల్ మిస్ చేసుకున్న న్యూజిలాండ్ జట్టు, 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది. అయితే అంతకుముందు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టును ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది న్యూజిలాండ్...

ఐసీసీ టోర్నీల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తున్న న్యూజిలాండ్, ఈసారి కూడా కేన్ విలియంసన్‌కే కెప్టెన్సీ పగ్గాలను అప్పచెప్పింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ తన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నాడు కేన్ విలియంసన్...

దాదాపు 18 నెలల క్రితం ఆఖరి అంతర్జాతీయ సెంచరీ చేసిన కేన్ విలియంసన్ ఫామ్‌తో పాటు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ జేమ్స్ నీశమ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపాయి...

సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్‌లకు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. వీరితో పాటు సీనియర్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌‌కి తిరిగి పిలుపునిచ్చింది కివీస్...

లూకీ ఫర్గూసన్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంచుకున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు... ఆల్‌రౌండర్ జిమ్మీ నీశమ్, స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీలకు టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కింది...

కివీస్ స్టార్ పేసర్ కేల్ జెమ్మీసన్ వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న కేల్ జెమ్మీసన్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం పెట్టిన న్యూజిలాండ్... టాడ్ అస్లే, టీమ్ సిఫర్ట్‌లను కూడా తప్పించింది. 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ఇది: కేన్ విలియంసన్ (కెప్టెన్), ఫిన్ ఆలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్‌ చాప్‌మన్, డివాన్ కాన్వే, లూకీ ఫర్గూసన్, మార్టిన్ గుప్టిల్, డార్ల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీశమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ

టీ20 వరల్డ్ కప్‌కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో త్రైపాక్షిక టీ20 సిరీస్ ఆడుతోంది న్యూజిలాండ్. అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రై సిరీస్‌, అక్టోబర్ 15న ముగుస్తుంది. వారం రోజుల్లో ఏడు టీ20 మ్యాచులు ఆడబోతోంది న్యూజిలాండ్...

గత టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏలో పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో పోటీపడిన న్యూజిలాండ్ , ఈసారి గ్రూప్ స్టేజీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో తలబడబోతోంది.

click me!