ధోని వల్లే ఇదంతా.. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేయమని చెప్పింది అతడే: మాజీ పిచ్ క్యూరేటర్ సంచలన వ్యాఖ్యలు

By Srinivas MFirst Published Mar 7, 2023, 9:43 PM IST
Highlights

INDvsAUS: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పిచ్  ల గురించి  జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. విదేశీ ఆటగాళ్లే గాక  ఇండియాకు చెందిన మాజీలు కూడా పిచ్ ల మీద చర్చోపచర్చలు చేస్తున్న వేళ మాజీ పిచ్ క్యూరేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కంటే అత్యధికంగా చర్చ జరుగుతున్నది పిచ్‌ల మీదే.   నాగ్‌పూర్, ఢిల్లీ తో పాటు ఇటీవలే ముగిసిన ఇండోర్ లో  కూడా పిచ్ మీద జరగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇంకా  మొదలుకాని అహ్మదాబాద్ పిచ్ గురించి కూడా ఇప్పటికే  క్రీడా పండితులు, ఆస్ట్రేలియా మాజీలు విశ్లేషణల మీద విశ్లేషణలు, శూల శోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు భారత్ లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేయమని చెప్పిందే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అని  మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

ధోని  కెప్టెన్ గా ఉండగా తనతో  భారత్ లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేయమని అడిగాడని.. అంతకుముందు  నాలుగు, ఐదు రోజులు జరిగిన  టెస్టు మ్యాచ్ లు ఆ తర్వత మూడు రోజులకే మారాయని  దల్జీత్ సింగ్ అన్నాడు. 

Latest Videos

భారత్ లో పిచ్ ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే  ముందుగా చెప్పుకోవాల్సింది దల్జీత్ సింగ్ గురించే. బీసీసీఐ ఆలిండియా గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీకి చాలాకాలం పాటు ఆయన  చైర్మన్ గా ఉన్నాడు. ఆయన హయాంలోనే భారత్ లోని చాలా క్రికెట్ గ్రౌండ్ లలో    స్పిన్, ఫాస్ట్, బౌన్సీ పిచ్ లు తయారయ్యాయి.   బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా పిచ్ ల గురించి చర్చ జరుగుతుండటంతో తాజాగా ఆయన  స్పందిస్తూ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు.  

ఇదీ చదవండి : ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ అసంతృప్తి.. ఇండోర్ పిచ్‌పై పోరాటానికి సిద్ధం..!

ఇండియా.కామ్  వెబ్‌సైట్ తో  దల్జీత్ సింగ్ మాట్లాడుతూ... ‘ధోని కెప్టెన్సీ కంటే ముందు మీరు ఇండియాలో జరిగిన టెస్టు మ్యాచ్ లను గమనిస్తే అవి కనీసం  నాలుగు రోజుల పాటు తప్పకుండా జరిగేవి. నాలుగో రోజు చివరి సెషన్ లో గానీ లేదా ఐదో రోజు వరకు గానీ ఫలితం వచ్చేవి.  అప్పుడు పిచ్ మీద  కాస్త గడ్డి,  తేమ ఉండే విధంగా ఉండేవి. అవి  ఫాస్ట్ బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడేవి.   మూడో రోజు వరకు బ్యాటింగ్ కు అనుకూలంగా మారి ఆ తర్వాత రెండు రోజులు స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగేలా  ఉండేది... 

కానీ టెస్టులలో ఎంఎస్ ధోని సారథిగా నియమితుడయ్యాక  స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేయాలని నాకు చెప్పాడు. ఈ పిచ్ లు అంటే భారత్  ఆటగాళ్లకు చాలా ఇష్టమని అతడు నాతో అన్నాడు. అప్పట్నుంచి మేం దేశవ్యాప్తంగా  ఇలాంటి పిచ్ లనే తయారుచేశాం..’అని చెప్పాడు. 

దేశవ్యాప్తంగా ఉన్న పిచ్ లలో  రెండు రకాల మట్టితో తయారుచేసినవి ఉన్నాయని.. అందులో ఒకటి నల్లమట్టితో తయారుచేస్తే మరొకటి ఎర్రమట్టితో చేస్తామని దల్జిత్ సింగ్ తెలిపాడు. నల్లమట్టిని ఒడిశా నుంచి  తీసుకొస్తే ఎర్రమట్టిని మాత్రం మహారాష్ట్ర నుంచి తీసుకొస్తామని  దల్జిత్ వివరించాడు. 

click me!