
తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసిన జేపీ నడ్డా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సంభాషణ గొప్పగా సాగిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడాకారులు పొందుతున్న ప్రోత్సహం గురించి ఆమె ప్రశంసించడం వినయంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా చెప్పారు.
జేపీ నడ్డా ట్వీట్‌పై స్పందించిన మిథాలీ రాజ్.. ఆయనకు థాంక్స్ చెప్పారు. జేపీ నడ్డాతో భేటీ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ భేటీ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని మోదీ నరేంద్ర మోదీ అందించిన మార్గదర్శకత్వం, మద్దతు, ప్రేరణతో..దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు మన దేశానికి కీర్తిని సాధించారని మిథాలీ రాజ్ పేర్కొన్నారు.
కొంత కాలంగా బీజేపీ అధిష్టానం.. తెలంగాణపై విపరీతమైన ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. గత నెలలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌లతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా జేపీ నడ్డా కూడా నితిన్, మిథాలీరాజ్‌లతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానుండటం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
అయితే మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన 23 ఏళ్ల కెరీర్‌లో మహిళల క్రికెట్‌లో అనేక రికార్డులను సాధించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు మిథాలీ రాజ్ ప్రకటించారు. అయితే జేపీ నడ్డా, మిథాలీ రాజ్ భేటీలో రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. ఎన్నికల ప్రచారానికి సెలబ్రిటీల గ్లామర్‌ను జోడించడంతోపాటు ప్రత్యేక వర్గాల ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.