ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో యువ సంచలనం మయాంక్ యాదవ్ బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. అయితే అతడి బుల్లెట్ బౌలింగ్ వెనకున్న రహస్యాన్ని తల్లి మమత యాదవ్ బయటపెట్టారు.
మయాంక్ యాదవ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన యంగ్ ప్లేయర్. బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ను బెంబేలెత్తిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో కీలక ఆటగాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక వేగంగా బంతులు వేసిన ఆటగాడిగా మయాంక్ రికార్డ్ సృష్టించాడు... ఇతడు ఐపిఎల్ లోని టాప్ 5 ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకరు. అయితే ఈ బౌలింగ్ స్పీడ్ వెనకున్న రహస్యాన్ని మయాంక్ తల్లి బయటపెట్టారు.
తన కొడుకు మయాంక్ యాదవ్ మాంసాహారం మానివేయడమే విజయ రహస్యమని మమత యాదవ్ తెలిపారు. రెండేళ్ల క్రితం వరకు మయాంక్ మాంసాహారం తినేవాడు... అప్పుడు అతడి బౌలింగ్ ఇంత గొప్పగా వుండేది కాదన్నారు. కానీ రెండేళ్ల నుండి మయాంక్ పూర్తిగా శాఖాహార డైట్ ఫాలో అవుతున్నాడు... దీంతో అతడి ఫిట్ నెస్, బౌలింగ్ లో ఊహించని మార్పులు వచ్చాయన్నారు. ఇలా తన కొడుకు విజయ రహస్యం శాఖాహారమే అంటూ ఆజ్ తక్ ఇంటర్వ్యూలో మమతా యాదవ్ వెల్లడించారు.
undefined
తన కొడుకు ఆహార అలవాట్ల మార్పుకు ఖచ్చితమైన కారణాలు లేవని మమత తెలిపారు. అయితే మయాంక్ చిన్నప్పటినుండి శ్రీకృష్ణుడిని విశ్వసిస్తాడు... అందువల్లే అతడు మాంసాహారాన్ని తినడం మానేసి పూర్తిగా శాఖాహారిగా మారివుంటాడని అన్నారు. అలాగే తన శరీరానికి మాంసాహారం సరిపోదని భావించడం కూడా ఓ కారణం కావచ్చని మయాంక్ తల్లి మమత పేర్కొన్నారు.
కారణం ఏదయితేనేం శాఖాహారిగా మారినప్పటి నుండి మయాంక్ ప్రదర్శనలో చాలా మార్పు వచ్చిందని... అద్భుతమైన బౌలర్ గా మారాడని తల్లి మమత తెలిపారు. అతడి నిర్ణయాన్ని తాము ఎప్పుడూ గౌరవిస్తాము... అలాగే ఆహార అలవాట్ల మార్చుకుంటానని అన్నపుడు కూడా అలాగే చేసామన్నారు. తన కొడుకు ఇలాగే అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ వుండాలని... భారత జట్టులో చోటు దక్కించుకుని దేశం తరపున ఆడాలని కోరుకుంటున్నానని మమతా యాదవ్ అన్నారు. త్వరలోని తన కోరిక తీరి అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేసారు.
ఎవరీ మయాంక్ యాదవ్?
మయాంక్ ప్రభు యాదవ్... 2002 జూన్ 17న దేశ రాజధాని డిల్లీలో జన్మించాడు. చిన్ననాటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకోవడంతో మయాంక్ ను అటువైపే నడిపించారు తల్లిదండ్రులు. దీంతో అంచెలంచెలుగా ఎదిగి డిల్లీ జట్టులో చోటు దక్కించుకుని దేశవాళి క్రికెట్ ఆడాడు. 17 లిస్ట్ ఏ మ్యాచుల్లో 34 వికెట్లు పడగొట్టి మంచి ఫేసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతడు ఐపిఎల్ ప్రాంచైజీల దృష్టిలో పడ్డాడు... అతడిని లక్నో సూపర్ జాయింట్స్ టీం రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో 2022లో లక్నో తరపున ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2023లో గాయం కారణంగా ఐపీఎల్ లో ఆడలేకపోయిన మయాంక్. కానీ 2024 లో పూర్తి ఫిట్ నెస్ తో బరిలోకి దిగిన అతడు ఫాస్టెస్ట్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.