GT vs PBKS Highlights : శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ వృథా అయింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల సూపర్ ఇన్నింగ్స్ తో గుజరాత్ పై పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
GT vs PBKS Highlights : ఐపీఎల్ 2024 17వ సీజన్ లో 17వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. యంగ్ ప్లేయర్లు శశాంక్ సింగ్, అశుతోష్ సూపర్ ఇన్నింగ్స్ తో 200 పరుగులు భారీ టార్గెట్ ను ఛేధించింది. ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఏ పరిస్థితిలోనూ పంజాబ్ గెలిచే అవకాశాలు కనిపించలేదు కానీ, ఎప్పుడైతే శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడే అప్పటి నుంచే గేమ్ ను పంజాబ్ వైపు తీసుకురావడం షురూ చేశాడు. గుజరాత్ 199/4 పరుగులు చేయగా, పంజాబ్ 19.5 ఓవర్లలో 200/7 విజయాన్ని అందుకుంది.
గిల్ భారీ ఇన్నింగ్స్ వృథా..
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ అందించాడు. ప్రారంభంలో తడబడింది కానీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కుదురుకున్న తర్వాత సూపర్ షాట్లతో పంజాబ్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ 2024లో 17వ సీజన్‌లో తన మొదటి హాఫ్ సెంచరీని చేరుకోవడానికి శుభ్‌మన్ గిల్ 190.48 స్ట్రైక్ రేట్‌తో 5 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. మొత్తంగా 48 బంతుల్లో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. సాహా 11 పరుగులు మాత్రమే చేసి కగిసో రబాడ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ 26 పరుగులు, సాయి సుదర్శన్ 33 పరుగులు చేశాడు. చివరలో రాహుల్ తెవాటియా ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్సరు బాదాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కసిగో రబాడ 2 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అరంభంలో తడబడి.. థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన పంజాబ్
200 పరుగులు భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు మంచి అరంభం లభించలేదు. 2వ ఓవర్ లోనే కెప్టెన్ శిఖర్ ధావన్ (1 పరుగు) వికెట్ ను పంజాబ్ కోల్పోయింది. అయితే, జానీ బెయిర్ స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లేలో 50 పరుగులు దాటాయి. జానీ బెయిర్‌స్టో 22 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 35 పరుగులు, సామ్ కర్రాన్ 5 పరుగులు, సికందర్ రజా 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు. జితేష్ శర్మ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంజాబ్ గెలవడం కష్టమే అనే టైమ్ లో శశాంక్ సింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చి పడేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు. 29 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో అశుతోష్ శర్మ 31 పరుగుల ఇన్నింగ్స్ తో పంజాబ్ గెలుపులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పిన శశాంక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
చివరి బంతి వరకు ఉత్కంఠ..
ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో ఉత్కంఠను మరింత పెంచింది. పంజాబ్ కింగ్స్ విజయానికి చివరి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి. అశితోష్ శర్మ భారీ షాట్ ఆడాడు కానీ టైమింత్ కుదరకపోవడంతో రషీద్ ఖాన్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. రెండో బంతి వైడ్ కావడతో ఒక పరుగు లభించింది. మూడో బంతికి ఒక పరుగు వచ్చింది. నాలుగో బంతికి శశాంక్ సింగ్ ఫోర్ కొట్టాడు. దీంతో పంజాబ్ గెలుపునకు 2 బంతుల్లో ఒక పరుగు కావాలి. 5 బంతికి 1 పరుగు రావడంతో 200 పరుగుల భారీ టార్గెట్ ను చెధించి పంజాబ్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ 2024లో అత్యధిక స్కోరును చేజ్ చేసిన టీమ్ గా ఘనత సాధించింది.
IPL 2024 : ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్.. హైదరాబాద్ VS చెన్నై మ్యాచ్ జరిగేనా..?